యోగా ఆరోగ్యవంతమైన నవసమాజ నిర్మాణానికి దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ యోగాకు కొంత సమయం కేటాయించాలని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి అన్నారు …

బుధవారం భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆడిటోరియంలో జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “యోగాంధ్ర-2025” అనే పేరుతో రాష్ట్రవ్యాప్త యోగా ప్రచారాన్ని ప్రారంభించిందని దీనిలో భాగంగా యోగ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరు ప్రారంభించారు. ఈ మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు జరిగే యోగాంధ్ర-2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంటు ఆఫ్ పోలీసు అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా అందరితో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లా, మండల, గ్రామస్థాయిలో యోగపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. యోగ ఒక ఆధ్యాత్మిక సాధన అని, ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయ పడుతుందన్నారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని యోగా అభ్యాసనపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. యోగాతో శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని అందరిలో ఉన్నటువంటి ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుందన్నారు. క్రమంతప్పకుండా యోగా సాధన చేసి ఆరోగ్యమైన, ఆనందకరమైన జీవితాన్ని పొందాలని అన్నారు. యోగాకు భారత ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా విశిష్టమైన స్థానాన్ని ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దవారు వరకు అనేక రకముల ఒత్తిడిలకు గురి అవుతున్నారని దీని నుండి మనం మనల్ని కాపాడు కోవాలంటే యోగాను ప్రతి ఒక్కరూ రోజువారి చర్యలో భాగంగా ఆచరించాలన్నారు. ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదని ఇది నిరంతరం ప్రక్రియ అని ప్రతి ఒక్కరూ యోగాకు రోజులో కొంత సమయం కేటాయించాలని మన ఆరోగ్యానికి మనమే అత్యంత బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి అన్నారు.
ఈ సందర్భంగా ఉప్పలపాటి వెంకటేశ్వర రాజు, చిక్కాల అంబికలు ఈ యోగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి వివిధ ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంపై పూర్తి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి యం.వెంకటేశ్వర్లు, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, డియల్డివో వై.దోసిరెడ్డి , డిఇవో ఇ.నారాయణ, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, కాస్మోపాలిటన్ క్లబ్ ప్రతినిధులు, మహిళలు, పట్టణ ప్రముఖులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.