Close

యోగాను రోజువారీ దిన చర్యలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు రావు: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 03/06/2025

యోగాసన అభ్యసనం ఆరోగ్యానికి మాత్రల పనిచేస్తుంది..’

ఉత్సాహంగా యోగ కార్యక్రమంలో భాగ స్వామ్యులు అవుతున్న యువత, మహిళలు

. .జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

ప్రతి ఒక్కరూ యోగ ప్రాధాన్యత తెలుసుకొని అనుసరించాలి:

.. శాసనసభ్యులు పితాని సత్యనారాయణ

యోగాను రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకోవడంద్వారా అనారోగ్య సమస్యలు రావని, ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క మాత్ర లాగా పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

మంగళవారం ఉదయం పెనుగొండ మండల కేంద్రంలోని చారిత్రాత్మకమైన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారి దేవస్థానం ఆవరణ నందు యోగాంధ్ర- 2025లో భాగంగా సుమారు రెండు వేల మందితో నిర్వహించిన యోగా అభ్యాసన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ క్రీడాకారిణి మరియు యోగ మాస్టర్ ట్రైనర్ బి.శిరీష, ఆయుష్ శాఖ యోగా గురువులు బడుగు చంద్రశేఖర్, పడాల రామచంద్రారెడ్డి యోగ విశిష్టతను వివరిస్తూ చెప్పిన ఆసనాలను ఆసక్తిగా వింటూ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో దాసిరాజు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజలు, విద్యార్ధినీ విద్యార్థులు ఆసనాలు వేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర-2025 కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుచున్నదన్నారు. యోగపై అవగాహన కల్పించేందుకు జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన వశిష్ట గోదావరి వలందలరేవు ఒడ్డు న మే 27న యోగాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించామన్నారు. నేడు జూన్ మూడున పెనుగొండలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు వేల మంది వరకు భాగస్వాములై విజయవంతం చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు ఒక అరగంట వారి వారి రోజువారి ప్రణాళికలో యోగాను చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందని, తద్వారా చేసే పనిలో ఆటంకాలు లేకుండా చేసుకోవచ్చునని తెలిపారు.అందరూ యోగాని తమ జీవితంలో భాగం చేసుకుంటూ ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలని, దాని ద్వారా ఆరోగ్యం బాగుపడుతుందన్నారు. నిత్యం యోగాసనాలు వేయడం ద్వారా అనేక రుగ్మతలను దూరం చేసుకునేందుకు వీలుంటుందన్నారు. ప్రజలు తమ జీవన విధానంలో యోగాను భాగంగా చేసుకుని ఆరోగ్యమైన జీవనం సాగించాలన్నారు. ఆరోగ్యానికి ఒక్కొక్క ఆసనం ఒక మాత్రలా పనిచేస్తుందన్నారు. ప్రాణాయామం, బ్రమరి ఆసనాల ద్వారా తక్షణ ఫలితం కనిపిస్తుందని, మిగతా ఆసనాలు ఒకటి, రెండు రోజుల్లో ఫలితాలను ఇస్తాయన్నారు. యోగ సాధన అనేది మనస్సును లగ్నం చేయడంతో పాటు ఏకాగ్రత పెంపొందడంతో పాటు మనిషి జీవన విధానంలో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. ఇంతమంచి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని యోగాను జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. జూన్ 21వ తేదీ వరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జిల్లాలో ఇప్పటి వరకు 5,800 మంది యోగా శిక్షకులు ఉన్నారని, సమయం దొరికినప్పుడు ప్రతి ఒక్కరూ యోగ చేయాలని తెలిపారు.

**ఆచంట నియోజకవర్గం శాసనసభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో భాగమైన యోగ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈనెల 21న జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగ కార్యక్రమాలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్ ను నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21న వైజాగ్ లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొను యోగ కార్యక్రమానికి 5 లక్షల మంది ప్రజలు పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా నేడు పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రాంగణంలో యోగ అభ్యసన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారత ప్రభుత్వ ప్రతిపాదనతో 2014 సంవత్సరంలో 170 దేశాల ఆమోదంతో ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగిందన్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు శాసనసభ్యులు వివరించారు. యోగ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగంకావాలన్నారు. భారత సంస్కృతిలో అంతర్భాగం అయిన యోగను ప్రతి రోజూ సాధన చేసినట్లయితే దైనందిన జీవితంలో చురుకుగా ఉండటంతో పాటు ఆరోగ్య కరమైన జీవితం సాగించేందుకు వీలుంటుందన్నారు.

*జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ యోగ యొక్క ప్రాధాన్యత తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నెలరోజుల పాటు యోగాంధ్ర క్యాంపెయిన్ నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. నెల రోజులు పాటు గ్రామ, మండల, జిల్లా రాష్ట్రస్థాయిలో యోగ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రతిరోజు ఉదయం పూట ఎండలో ఉండడం ద్వారా డి విటమిన్ అందుతుందని, కూరగాయలు వంటి ఆహారం తీసుకోవడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటి అలవాట్లతో యోగాని కూడా చేర్చుకుంటే మరింత ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.

*జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 7.84 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. 128 మందికి మాస్టర్ ట్రైనర్స్ గా యోగ పై శిక్షణ ఇవ్వడం జరిగిందని, వీరు 5,800 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, వీరు గ్రామ స్థాయిలో ప్రజలకు యోగ పై శిక్షణ అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. మండల కేంద్రంలో మరియు ప్రతి పట్టణ కేంద్రాల్లో యోగ రోడ్డును నిర్ధారించి ప్రతి రోజూ యోగ సాధన చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన యోగ ప్రోటోకాల్ ప్రకారం యోగాంధ్ర క్యాంపెయిన్ జరుగుతున్నట్లు జాయింట్ కలెక్టర్ వివరించారు. యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా జిల్లాలోని వశిష్ట గోదావరి వందల రేవు నందు మే 27న యోగ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. నేడు జూన్ 3న పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించుకోగా, జూన్ 9న భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతి వనం, జూన్ 16 పేరుపాలెం బీచ్ ఇలా 4 పర్యాటక ప్రదేశాలను యోగాంధ్ర కార్యక్రమానికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. జూన్ 19న ప్రత్యేకంగా 5 వేల మందితో పెద్ద ఎత్తున యోగ కార్యక్రమం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జూన్ 9వ తేదీన భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద నిర్వహించే యోగ అభ్యసన కార్యక్రమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, డీఎస్పీ డా.శ్రీ వేద, జిల్లా టూరిజం శాఖ అధికారి ఏ.వి అప్పారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, తహసిల్దార్ జి.అనిత కుమారి, ఎంపీడీవో టి.సూర్యనారాయణమూర్తి, గ్రామ సర్పంచ్ నక్క శ్యామల సోనీ, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.