Close

యువత దేశానికి దిశా నిర్దేశమని, అదే స్థాయిలో ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి సురక్షితమైన వాహన చోదన ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 06/12/2025

శనివారం బివి రాజు కూడలి నుండి ఏర్పాటుచేసిన ట్రాఫిక్ పై అవగాహన త్రీ కే రన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, పెద్ద ఎత్తున కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు, అధికారులు, ప్రజలు, అథ్లెటిక్స్, వాకర్స్ అసోసియేషన్స్ పాల్గొని త్రీ కే రన్ ను జువ్వలపాలెం రోడ్ లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు కొనసాగించాయి. సుమారు ఐదు కిలోమీటర్ల పరిధిలో సాగిన త్రీ కె రన్ లో వందలాదిమంది పాల్గొని పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిబంధనలపై ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ, రహదారి భద్రత మనందరి బాధ్యత, హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్షణ, అధిక వేగం పొంచిఉన్న ప్రమాదం, ట్రిపుల్ రైడింగ్ చేయరాదు, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం అత్యంత ప్రమాదం, మద్యం సేవించి వాహనం నడపరాదు అనే స్లోగన్లతో పట్టణ ప్రాంతమంతా మారుమోగింది. ఉదయం పూట చలి తీవ్రత ఎక్కువగా ఉన్న ఉదయం ఆరు గంటలకే పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజలు కూడలికి చేరుకోవడం ఆశ్చర్యపరిచింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఒక ప్రాణాన్ని కోల్పోతే వారి కుటుంబమే కాకుండా, ఎన్నో కుటుంబాలపై దాని ప్రభావం ఉంటుందని, ట్రాఫిక్ నిబంధనలను ప్రజలు, ముఖ్యంగా యువత తప్పనిసరిగా పాటించి సురక్షితమైన చోధన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక్కొక్క సారి ప్రమాద సమయంలో కుటుంబ యజమానిని లేదా చేతికి అంది వచ్చిన కుమారుడను, ఇలా పలువురు ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని, అలా జరిగిన కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితుల్లో చిన్నాభిన్నం అవుతాయని, చేతికి అంది వచ్చిన కుమారుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం యొక్క బాధ వర్ణనాతీతం అన్నారు. యువత తల్లిదండ్రులు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టకుండా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాదాలు జరిగిన సందర్భంలో హెల్మెట్ ధరించిన వారు ఎందరో ప్రమాద నుండి ప్రాణాలను రక్షించుకోగలిగారన్నారు. హెల్మెట్ పెట్టుకోవడం అంటే బెల్టు వదిలేయడం కాదని బెల్ట్ కూడా లాక్ చేసుకోవాలని, ప్రమాదం జరిగిన సందర్భంలో అప్పుడే హెల్మెట్ ఊడకుండా ఉంటుందన్నారు. యువత ట్రాఫిక్ రూల్స్ పాటించడంతోపాటు, ఫిట్ ఇండియా స్ఫూర్తితో ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు.

జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ యువత, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా మరొకరికి ఆదర్శంగా ఉండాలని, అప్పుడే ప్రమాదాలను నియంత్రించగలమన్నారు. నిబంధనలు అతిక్రమించి ఎవరు అపరాధ రుసుము చెల్లించే పరిస్థితి తెచ్చుకోవద్దని సున్నితంగా హెచ్చరించారు. హెల్మెట్ ధరించకపోతే రూ.1000/-, అతివేగంతో వాహనాలను నడిపితే రూ.1000/-, ట్రిపుల్ రైడింగ్ రూ.1,500/-, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.1,500/-, మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10,000/- అపరాద రుసుము విధించడం జరుగుతుందని సూచించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జీవితంలో క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని, అలాగే ఆరోగ్యవంతమైన, సురక్షితమైన జీవనానికి దోహదపడుతుందన్నారు. మన వాహన ప్రయాణం రోడ్డుమీద నడిచేవారికి ప్రమాదకరంగా ఉండకూడదు అన్నారు.

త్రీ కే రన్ ప్రారంభానికి ముందు “ఫిట్ ఇండియా” కాన్సెప్ట్ తో శారీరక దారుణ్యంపై అవగాహన కల్పించేందుకు విష్ణు కాలేజీ విద్యార్థులు లఘు ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకున్నది.

చివరిగా ఎస్.ఆర్.కె.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు హెల్మెట్ ధరించకపోవడం వలన జరిగే అనర్ధంపై లఘు ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. తల్లి హెల్మెట్ పెట్టుకోమని చెప్పిన, ఏం కాదు అంటూనే బైక్ మీద వెళ్లిన యువకుడు రోడ్డు యాక్సిడెంట్ లో మరణించడం ఇతివృత్తం అందరి కళ్ళు చెమర్చాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, భీమవరం ఆర్టీవో కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి, డి.ఎస్.పి డాక్టర్ శ్రీ వేద, జిల్లా రవాణా అధికారి కృష్ణారావు, మున్సిపల్ కమిషనర్ కే.రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఏ.రాంబాబు, డిపిఓ ఎం. రామ్నాథ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ విజయ్, డీఈవో ఇ.నారాయణ, డిఎస్డివో దాసు, ఎల్ డి ఎం ఏ.నాగేంద్ర ప్రసాద్, ఎంహెచ్ఓ సోమశేఖర్, రెడ్ క్రాస్ ప్రతినిధి గోపిశెట్టి రామకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎస్ ఆర్ కె ఆర్, బివి రాజ్ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.