Close

యువత క్వాంటం టెక్నాలజీ ఆవిష్కరణలను అందిపుచ్చుకుని, ప్రపంచవ్యాప్తంగా కీలకంగా వ్యవహరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Publish Date : 26/08/2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా యువ సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి పర్యవేక్షణలో జాతీయస్థాయిలో చేపట్టిన “అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాక్తాన్ 2025” సెమీఫైనల్స్ సెప్టెంబర్ 10వ తేదీన భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదగా మంగళవారం పశ్చిమగోదావరి భీమవరం ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఐడియా ల్యాబ్ లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ కె ఆర్ సెక్రెటరీ & కస్పాండెంట్ ఎస్ ఆర్ కె నిశాంత్ వర్మ, డైరెక్టర్ జగపతి రాజు, ప్రిన్సిపాల్ కె.వి మురళీకృష్ణంరాజు, ఏక్యువిహెచ్ కోఆర్డినేటర్ డాక్టర్ గోపాల కృష్ణమూర్తి, రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ రవి కృష్ణ వర్మ, హెచ్ ఓ డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రపంచానికి సాంకేతిక నిపుణులను అందించిన ఘనత భారత్ కె దక్కుతుందన్నారు. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో చూసినా సాంకేతిక రంగంలో ప్రతి ఐదుగురిలో ఇద్దరు లేదా ముగ్గురు భారతదేశానికి చెందిన వారే ఉంటారని అది మన దేశం సాధించిన ఘనత అని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువ సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయం అన్నారు. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ మేధావుల్లో దాగి ఉన్న విజ్ఞానాన్ని జాతీయ స్థాయి పోటీలు ద్వారా వెలుగు తీసుకురావడం వలన భారతదేశం గర్వించదగ్గ మేధావులను తయారు చేసే ఘనత ఏపీకి దక్కుతుందని కలెక్టర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు టెక్నాలజీ ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడానికి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ ఒక మార్గ నిర్దేశంగా దోహదపడుతుందన్నారు. విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వినూత్న ఆలోచనలను, ఆవిష్కరణలను ముందు ఉంచాలని సూచించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అన్ని కళాశాలలు 2025 ఆగస్టు 28న అంతర్గత హ్యాకథాన్‌లను నిర్వహిస్తున్నాయన్నారు. ఈ ప్రాంతీయ సెమీ-ఫైనల్ రౌండ్‌లో పోటీ పడటానికి ప్రతి కళాశాలలో మొదటి రెండు జట్లను నామినేట్ చేస్తాయన్నారు. ఒక్కొక్క టీం లో ఆరుగురు ఉంటారని, ఎంపికైన సుమారు 25 నుండి 30 టీములు సెప్టెంబర్ 10న పశ్చిమగోదావరి జిల్లా ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే ప్రాంతీయ సెమీ-ఫైనల్ రౌండ్‌లో పోటీలో పాల్గొంటాయని తెలిపారు. విశిష్ట న్యాయనిర్ణేతల ప్యానెల్ ద్వారా వీరిలో ఒక విజేత మరియు ఒక రన్నరప్ జట్టు ఎంపిక చేయడం జరుగుతుంది అన్నారు. అనంతరం అమరావతిలో జరిగే గ్రాండ్ ఫినాలేకు ఈ జట్లు పాల్గొంటాయన్నారు. అంతర్గత హ్యాకథాన్‌లో ఎంపిక కాబడిన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోని కాలేజీల మొదటి రెండు జట్లకు సెమీ ఫైనల్స్ నిర్వహించడానికి పశ్చిమగోదావరి జిల్లా ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆతిథ్యం కల్పించడంతో పాటు సెమీ-ఫైనల్ విజేతలు, రన్నర్లకు బహుమతులను స్పాన్సర్ చేయడం పట్ల కాలేజీ యాజమాన్యాన్ని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు.

కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత్ వర్మ మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన కళాశాల స్థాయిలో హ్యాకథాన్‌ పోటీలు జరుగుతాయని, అక్కడ ఎంపికైన రెండేసి బృందాలు సెప్టెంబర్ 10న ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి తమ కళాశాలలో ప్రభుత్వం సెమీఫైనల్స్ ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెమీఫైనల్స్ కు తమ కళాశాలను ఎంపిక చేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ కళాశాల కు అందించిన అరుదైన గౌరవంగా పేర్కొన్నారు.

అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ 2025

అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ 2025 అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న క్వాంటం టెక్నాలజీల రంగంలో విద్యార్థులచే నడిచే ఆవిష్కరణలను అన్‌లాక్ చేయడానికి రూపొందించబడిన జాతీయస్థాయి మార్గ నిర్దేశం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నేతృత్వంలోని ఈ హ్యాకథాన్ రక్షణ, లాజిస్టిక్స్, డ్రగ్ డిస్కవరీ, వ్యవసాయం మరియు ఆర్థికం వంటి కీలక రంగాలలో డీప్-టెక్ పరిష్కారాల కోసం భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీని ప్రత్యేక స్థానంలో ఉంచనుంది. ఈ రకమైన మొట్టమొదటి కార్యక్రమం మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, పి ఎస్ యు లు, ప్రముఖ టెక్ దిగ్గజాలు మరియు స్వచ్ఛంద సంస్థల నుండి సేకరించిన వాస్తవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి విద్యార్థులను శక్తివంతం చేస్తుంది. ఐబీఎం, టిసిఎస్, డి ఎస్ టి, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అగ్ర సంస్థల నుండి క్రియాశీల మద్దతుతో హ్యాకథాన్ ప్రతిభను ఆకర్షించడంతో పాటు, పరివర్తన ఆలోచనలకు లాంచ్‌ప్యాడ్‌గా ఉండాలని లక్ష్యంగా చెప్పటం జరిగింది.