యుద్ధం ఎవరు కోరుకోవడం లేదని, అనివార్యమైతే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన అవగాహనతో ప్రతి ఒక్క పౌరులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

మినిస్టరీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఇన్ ఇండియా రూపొందించిన సమాచారాన్ని క్రోడీకరించి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ తయారుచేసిన “యుద్ధం మాకు వద్దు, అనివార్యమైతే ఎదుక్కునేందుకు మేము సిద్ధం” అనే పుస్తకాన్ని శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి డాక్టర్ ఆర్.కుమరేశ్వరన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ యుద్ధాన్ని ఎవరు కోరుకోరని, యుద్ధం వలన ప్రజలను, ఆర్థిక వనరులను పెద్ద మొత్తంలో కోల్పోవాల్సి వస్తుందని ఇది ఏ దేశానికైనా తీరని లోటు అన్నారు. ఏ దేశమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే కోరుకుంటుందని, యుద్ధ వాతావరణం నెలకొన్న దేశాలే కాకుండా ఇతర దేశాలు కూడా ఇటువంటి సందేశాలను అందజేస్తాయన్నారు. రెండు దేశాల యుద్ధం ప్రభావం మిగతా దేశాల మీద కూడా ఎంతో కొంత పడుతుందని ఇది అందరికీ తెలిసిందే అన్నారు. మాకు యుద్ధమే కావాలి అని మొండి వైఖరితో ముందుకు వస్తే, పొరుగు దేశాన్ని ఎదుర్కోవడానికి త్రివిధ దళాలతో పాటు, పౌరులు కూడా సైనికులుగా మారి ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఎటువంటి శిక్షణ లేని పౌరులు కూడా అవగాహన కలిగి ఉండడం ద్వారా యుద్ధ సమయంలో ఉన్న పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వీలవుతుందనే ఉద్దేశంతో, ముందస్తు జాగ్రత్తల సమాచారాన్ని పుస్తక రూపంలో ముద్రించడం జరిగిందన్నారు. ఈ బుక్లెట్ సమాచారం అన్ని స్థాయిలోని జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారికి సూచించారు.