యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్‌పై ఆక్వా రైతులకు అవగాహన కల్పించాలి

Publish Date : 23/11/2026
WhatsApp Image 2026-11-23 at 8.03.48 PM

యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) నివారణకు యాంటీబయాటిక్స్ వినియోగంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ, శాస్త్రీయ పద్ధతుల్లో ఆక్వా సాగు నిర్వహించాలని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సూచించారు.

ప్రపంచ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 18 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం వీరవాసరం మండలం కొణితివాడ గ్రామం నవదూరు జంక్షన్‌లోని శ్రీ పద్దాలాల్ వెంకమ్మ అమ్మవారి ఫంక్షన్ హాల్‌లో జాతీయ సుస్థిర ఆక్వాకల్చర్ కేంద్రం (నాక్సా), ఎంపీఈడీఏ ఆధ్వర్యంలో పదో విడత ఏఎంఆర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రొయ్యల సాగులో యాంటీబయాటిక్స్‌ను అనవసరంగా వినియోగించడం వల్ల వాటి అవశేషాలు రొయ్యల్లోనే కాకుండా పర్యావరణం, మానవ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. నాణ్యమైన ఆక్వా ఉత్పత్తుల ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేందుకు రైతులు మంచి ఆక్వాకల్చర్ నిర్వహణ పద్ధతులను పాటించాలని సూచించారు.

నాక్సా సీఈఓ దైహున్ ఖోంగ్లాం ఏఎంఆర్ ప్రాముఖ్యత, దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఉండి మత్స్య పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ ఎ. చంద్రశేఖర్ రావు ఎగుమతులు, యాంటీబయాటిక్ అవశేషాలు, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంశాలపై సాంకేతిక వివరణ ఇచ్చారు. ఎంపీఈడీఏ భీమవరం జేటీఓ ఎస్. దుర్గారావు భారతీయ ఆక్వాకల్చర్‌లో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ప్రభావంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మత్స్యశాఖ భీమవరం ఎఫ్‌డీఓ వివేక్ యాంటీబయాటిక్స్ వినియోగం వల్ల మానవ ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాలు, ఆక్వాకల్చర్‌లో వాటి వినియోగంతో ఎదురయ్యే సమస్యలను వివరించారు.

ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ జి. వరలక్ష్మి, నాక్సా ఎస్‌సీఓ ఎస్. బాలాజీ, ఎఫ్‌ఎం ఎం. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని 89 మంది ఆక్వా రైతులు పాల్గొని ఏఎంఆర్ నివారణ, శాస్త్రీయ ఆక్వా సాగు పద్ధతులపై అవగాహన పొందారు. నాక్సా ఎస్‌సీఓ ఎస్. బాలాజీ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.