Close

మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా ఉద్యోగంలో చేరి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి.

Publish Date : 29/11/2025

శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో భీమవరంలోని ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు నిర్వహించిన మెగా జాబ్ మేళా సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట్ర పీఏసీ చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ఈ మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన వారందరూ తప్పనిసరిగా ఉద్యోగంలో చేరి తమ ప్రతిభతో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. ఉద్యోగం పెద్దగా, చిన్నదా, జీతం ఎక్కువ, తక్కువ అని ఆలోచించకుండా ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ ఉద్యోగాలలో చేరాలన్నారు. చదివి ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉండటం వారి జీవితాన్ని వారు నాశనం చేసుకోవడమే అన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తున్నయన్నారు. ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహణ ప్రభుత్వాల చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. నేడు ఈ ఉద్యోగ మేళాలో ఉద్యోగానికి ఎంపిక కాకపోతే నిరాశ చెందవద్దని మరోసారి ప్రయత్నించి ఉద్యోగం సాధించాలన్నారు.

రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ నేడు ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన అందరికి అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు లభించే ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి అన్నారు. ఎంపికైన అభ్యర్థులందరూ ఉద్యోగాలలో చేరాలన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భారత దేశంలో యువతి, యువకుల శాతం ఎక్కువగా ఉందన్నారు. అందువల్ల నైపుణ్యం గల విద్యావంతుల కోసం ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నారన్నారు. నైపుణ్యం గల అభ్యర్థులకు ఉద్యోగాలకు లోటు లేదన్నారు.వివిధ రంగాలకు చెందిన 28 కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో 3000 ఉద్యోగాలకు గాను 2180 మంది రిజిస్టర్ చేసుకోగా నేడు 790 మంది వివిధ రంగాలలో ఉద్యోగాల ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగం రానివారు నిరాశపడకుండా మరోసారి ఉద్యోగ ప్రయత్నం చేయాలన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆయా కంపెనీలలో ఉద్యోగాల్లో చేరాలన్నారు.

ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ వివిధ రంగాలకు చెందిన 28 కంపెనీల ద్వారా నేడు ఉద్యోగాలకు ఎంపికైన వారందరూ ఉద్యోగాలలో చేరి తమ ప్రతిభ ద్వారా మంచి స్థానాలకు చేరుకోవాలని అన్నారు.

రాష్ట్ర పీఏసీ చైర్మన్, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భారతదేశంలో ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగానే పరిస్థితికి చేరుకున్నామన్నారు మన యువత ఆంగ్లభాష పరిజ్ఞానం పెంచుకొని మంచి ఉద్యోగాలను స్థిరపడుతున్నారన్నారు. జీతం తక్కువ అనే భావన కలుగకుండా ఎంపికైన అభ్యర్థులు దూర ప్రాంతమైన ఉద్యోగాలలో చేరి మంచి ఉన్నత స్థానానికి చేరాలన్నారు.

అనంతరం మెగా జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, తహసిల్దార్ రావి రాంబాబు, ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ సెక్రటరీ ఎస్.ఆర్.కె నిశాంత్ వర్మ, ఏవో సిహెచ్ దిలీప్ చక్రవర్తి, ప్రిన్సిపాల్ మురళీకృష్ణరాజు, డైరెక్టర్ జగపతి రాజు విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.