మురసు తుఫాను ప్రభావంతో జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటమునిగిన పలు ప్రాంతాలు, డ్రైనేజీలు, వ్యవసాయ పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు.

Publish Date : 03/11/2026
WhatsApp Image 2026-11-03 at 6.32.07 PM

మురసు తుఫాను ప్రభావంతో జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటమునిగిన పలు ప్రాంతాలు, డ్రైనేజీలు, వ్యవసాయ పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు.

మంగళవారం నరసాపురం, పాలకొల్లు మండలం, వీరవాసరం మండలాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించి
వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుని, తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

** నరసాపురంలో భారీ వర్షాలకు నీట మునిగిన రహదారులు, డ్రైన్ లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ నివారణ చర్యలు చేపట్టవలసినదిగా సంబంధిత అధికారులకు తెలిపారు.

**పాలకొల్లులో జలమయమైన రహదారులు, డ్రైనేజీల పరిశీలన.

పాలకొల్లు మండలంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, రామాలయం వీధిలో భారీ వర్షాలకు నీటమునిగిన రహదారులు, డ్రైనేజీలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం లక్ష్మీనగర్‌లో పూర్తిగా నీటమునిగిన రహదారులు, డ్రైనేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రైనేజీలు, కాలువల్లో నిలిచిపోయిన వర్షపు నీరు ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా ప్రవహించేలా వెంటనే చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నీటి నిల్వల కారణంగా ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కోకుండా, రహదారులపై నిలిచిన నీటిని తొలగించేందుకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

**తుఫాను బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ పరిశీలన.

పర్యటనలో భాగంగా పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలోని నిత్యావసర సరుకుల పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. తుఫాను ప్రభావిత కుటుంబాలకు అందించాల్సిన బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల సరఫరా, పంపిణీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందించాల్సిన సహాయాన్ని సక్రమంగా, ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని సంబంధిత సిబ్బందికి తెలిపారు. అనంతరం తుఫాను బాధితులకు జిల్లా కలెక్టర్ స్వయంగా బియ్యం పంపిణీ చేశారు. వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

**మత్స్యపురిలో నీటమునిగిన పంట పొలాల పరిశీలన,రైతులతో ముఖాముఖి.

వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో భారీ వర్షాల కారణంగా నీటమునిగిన వ్యవసాయ పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. వర్షపు నీటిలో మునిగిన పంటలను, పొలాల్లో నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రైతులను పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నదని, పెట్టుబడులు కూడా నష్టపోయామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని, పంట నష్టానికి తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకుని, పంట నష్టానికి సంబంధించిన వివరాలను పరిశీలించారు.

తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వలు, డ్రైనేజీ సమస్యలు, పంట నష్టాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని సకాలంలో అందించడంతో పాటు, ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో నరసాపురం ఎమ్మార్వో నాగార్జున, పాలకొల్లు తహసీల్దార్ దుర్గా కిషోర్, వీరవాసరం తహసీల్దార్ బి. కనకదుర్గ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.