మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

Publish Date : 15/10/2026
WhatsApp Image 2026-10-15 at 3.43.28 PM

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి

ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

నరసాపురం మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది తమ బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి, సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ ఆదేశించారు.

గురువారం భీమవరం కలెక్టరేట్లోని పి.జి.ఆర్.ఎస్. సమావేశ మందిరంలో నరసాపురం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల అధికారులు, అదనపు ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, జోనల్ అధికారులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పర్యవేక్షణ బృందం, సంబంధిత సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకొని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి దశ కీలకమైనదని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి నిర్దేశించిన విధివిధానాలు, అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాలు, సంబంధిత రికార్డుల నిర్వహణపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని పేర్కొన్నారు.

నామినేషన్ల స్వీకరణ విధులకు కేటాయించిన అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం ప్రతిరోజూ సంబంధిత రోజువారీ నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించాలని ఆదేశించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రవర్తనా నియమావళిని అధికారులు క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు పాటించాల్సిన నియమాలను పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినప్పుడు సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తూ, వివిధ విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధుల్లో ఎదురయ్యే సందేహాలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి తనకు కేటాయించిన విధులపై స్పష్టత కలిగి ఉండటంతో పాటు, ఇతర విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికత, జవాబుదారీతనానికి ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నరసాపురం మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పి గ్లోరియా, కె ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ పి ప్రభాకర్, అదనపు ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, జోనల్ అధికారులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పర్యవేక్షణ బృందం, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.