Close

“మీ భూమి – మీ హక్కు” గ్రామసభ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Publish Date : 08/06/2026

సిద్ధాంతం గ్రామం నుంచే రైతు సంక్షేమానికి మరో కీలక ముందడుగు

రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ప్రభుత్వ రాజముద్రలతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్‌లో సిద్ధాంతం గ్రామ సమీపంలోని హెలిపాడ్‌కు చేరుకోగా, మాజీ మంత్రి మరియు ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హెలిపాడ్ నుండి కాన్వాయ్ ద్వారా గ్రామసభ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి వేలాది మంది టిడిపి కార్యకర్తలు, అభిమానులు, రైతులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు.

సబా ప్రాంగణం కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులతో కిక్కిరిసిపోయి ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి, భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడం, రైతుల ఆస్తి హక్కులను శాశ్వతంగా పరిరక్షించడం, భూ వివాదాలకు చెక్ పెట్టడం లక్ష్యంగా “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతుల భూములకు చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “భూమి రైతుకు ఆస్తి మాత్రమే కాదు, అది అతని జీవనాధారం. రైతు భూమిపై పూర్తి హక్కులు కలిగి ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. భూ సంబంధిత సేవలను గ్రామ స్థాయికే తీసుకువస్తూ ప్రజలకు సులభతరం చేస్తున్నాం” అని పేర్కొన్నారు.

అనంతరం ఎంపిక చేసిన పలువురు రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. పాస్ పుస్తకాలను అందుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా భూ హక్కుల పరిరక్షణకు “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం ఒక కీలక మైలురాయిగా నిలవనుందని పలువురు అభిప్రాయపడ్డారు. సిద్ధాంతం గ్రామం నుంచే రైతు సంక్షేమానికి మరో కీలక ముందడుగు పడిందని స్థానికులు పేర్కొన్నారు.

 

4.222 4.333      4.111