మార్చి నెలలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు.
మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణ.
జిల్లాలో 132 కేంద్రాల్లో 24,166 మంది పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థిని, విద్యార్ధులు.
……జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో 10 తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం విద్యాశాఖ, ఇంటర్మీడియట్, సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి నెలలో జరగనున్న 10 తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎటువంటి లోటు పాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయని, ఈ పరీక్షలు 132 కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. 24,166 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు ఈ పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు 3 సెంటర్లలో ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, ఈ పరీక్షలకు 652 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు.
అదేవిధంగా ఎస్ఎస్ సి ఓపెన్ స్కూల్ ద్వారా పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు 8 కేంద్రాలలో ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు 680 రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.
పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షిస్తూ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు త్రాగునీరు సౌకర్యం, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్షల సమయాన్ని అనుగుణంగా ఉదయం, సాయంత్ర వేళల్లో ఆర్టీసీ బస్సులను నడపాలని ట్రాన్స్పోర్ట్ అధికారులు ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేసి మందులను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు నిర్వహణలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డీఈవో ఇ.నారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జి.ప్రభాకర్ రావు, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, జిల్లా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అధికారి వై.దోసి రెడ్డి, డి ఎం అండ్ హెచ్ ఓ జి.గీతా బాయ్, డి.ఎస్.పి రఘువీర్ విష్ణు, డి టి ఓ మహమ్మద్ బేగ్, ట్రాన్స్పోర్ట్, పోస్టల్ శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.