• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

మార్గదర్శుల నుంచి చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుంది-ఇంచార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Publish Date : 05/08/2025

పి4 కు స్వచ్ఛంధంగా వచ్చినవాళ్లే మార్గదర్శులు

మంగళవారం సచివాలయంలో పీ4పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. భీమవరం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ-పీ4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని, ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ నెల 19వ తేదీ నుంచి పీ4 అమలు చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన పీ4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
“పేదరిక నిర్మూలనలో భాగంగానే పీ4 కార్యక్రమాన్ని చేపట్టాం. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యం. సమాజానికి తిరిగి ఇవ్వాలన్నదే ప్రధాన ఉద్దేశం. బంగారు కుటంబాలకు కావాల్సింది ఎమోషనల్ బాండింగ్, చేయూత మాత్రమే. సీఎస్సార్ నిధులతో బిల్ గేట్స్, వేదాంత లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి మించి కుటుంబాలను ఆదుకోవటమే లక్ష్యంగా పీ4 కార్యక్రమం చేపట్టాం. ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నాం.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మార్గదర్శుల ఎంపిక స్వచ్ఛందమే

“బంగారు కుటుంబాలను ఆదుకోవటంలో మార్గదర్శుల ఎంపిక పూర్తిగా వాలంటరీగానే జరుగుతోంది. ఎక్కడా ఎవరిపైనా బలవంతం లేదు. మార్గదర్శుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదు. ఎవరినీ బలవంతం చేయొద్దు. మానవత్వం ఉండే వారే ఇందులో చేరతారు. కొందరికి మనస్సు ఉన్నా సమయం ఉండకపోవచ్చు. ఇలాంటి వారిని గుర్తించండి.. పీ4 వేదిక ఉందని చెప్పండి. ఆర్ధిక అసమానతలు మరింతగా తగ్గాలి. ఇవి పెరిగితే సమాజానికి మంచిది కాదు. ఇవాళ బంగారు కుటుంబంలో సాయం పొందిన వారే రేపు మార్గదర్శి కావచ్చు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందుకుంటూనే బంగారు కుటుంబాలకు అదనపు సాయం పీ4 ద్వారా అందుతుంది. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు, పారిశ్రామిక వేత్తలను కలిసి వారిలో ఆలోచనను రేకెత్తించండి.” అని సీఎం సూచించారు. “ఇప్పటి వరకూ 9,37,913 బంగారు కుటుంబాల ఎంపిక పూర్తి అయింది. 1,03,938 మంది మార్గదర్శులను గుర్తించాం. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల బంగారు కుటుంబాలకున్న అవసరాలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించాం అన్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటంతో పాటు గ్రామాలు, మండలాల వారీగా దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అలాగే ఫండ్ ఏ నీడ్ అనే అంశాన్ని కూడా పీ4 కార్యక్రమంలో పెట్టాం. ఈ కార్యక్రమం అమలును ప్రతీ మూడు నెలలకు ఓ మారు సమీక్షించుకుంటాం. ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో వాలంటరీగా పాల్గొనవచ్చు అని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, సిపిఓ కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.