Close

మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తిగా నియోజకవర్గ అభివృద్ధికి, వెనుకబడిన తరగతుల వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు.

Publish Date : 11/04/2025

శుక్రవారం పాలకొల్లు బస్టాండ్ సమీపంలోని అడబాల థియేటర్ వెనుక భాగంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీ వర్గాలకు ఉపకరణాల పంపిణీకి ఏర్పాటుచేసిన సమావేశానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతిరావు పూలే చిత్రపటానికి మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించక ముందు రాష్ట్రం పారిశ్రామికవేత్తలు, ఫ్యాక్షనిస్టులు, భూస్వాములు చేతుల్లో ఉండేదని, రాజకీయ పార్టీని స్థాపించి సామాన్యుడికి సైతం రాజకీయం తెలియచెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. బలహీన వర్గాలకు అభివృద్ధికి ప్రపంచంలోనే ఏ ప్రాంతంలో లేని విధంగా స్థానిక సంస్థలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీ టిడిపి అన్నారు. ఆయా వర్గాలను ముందుకు తీసుకువెళ్లేందుకు సర్పంచ్, ఎంపిటిసి జడ్పిటిసి, జడ్పీ చైర్మన్ తదితర పదవులను బీసీ వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ దగ్గర నుండి టిడిపి వరకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లను యధాతధంగా కొనసాగించడం జరిగిందన్నారు. గత ముఖ్యమంత్రి బీసీ రిజర్వేషన్లను 24% తగ్గించడం జరిగిందని, ముఖ్యమంత్రి కన్నా ముందు ఎంతమంది ముఖ్యమంత్రులు మారిన బీసీ రిజర్వేషన్లను తగ్గించలేదని, గత ముఖ్యమంత్రి 24 శాతానికి రిజర్వేషన్లను తగ్గించి బీసీలను దగా చేయడం జరిగిందన్నారు. ఎవరు బీసీలను మోసం చేశారో ప్రజలే ఆలోచన చేయాలన్నారు. రిజర్వేషన్లు తగ్గింపు కారణంగా ఎంపీటీసీ, జడ్పిటిసి వంటి 16 వేల పోస్టులలో బీసీలు రాజకీయంగా ప్రాతినిధ్యం లేకుండా గత ముఖ్యమంత్రి చేసిన కుట్ర అన్నారు. ఆదరణ పథకం ద్వారా చేతివృత్తలు, కులవృత్తులు వారికి 2014-19 మధ్య 90 శాతం సబ్సిడీతో కోట్లాది రూపాయల రుణాలను అందజేసి బీసీలను ఆదరించడం జరిగిందన్నారు. 2019-24 మధ్య ఆదరణ పథకం బలహీన వర్గాలకు ఉందా అని మనందరం ప్రశ్నించుకోవాలన్నారు. ఈ రకంగా అడుగడుగున దగాకి గురి చేయడంతో పాటు బీసీ సబ్ ప్లాన్ ను కూడా ఆటకెక్కించారన్నారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తితో వారి జయంతి రోజున బీసీలకు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా చేతివృత్తులకు, కులవృత్తులకు 50 మంది గీత కార్మికులకు, కొబ్బరి తెంపు కార్మికులకు మోకులు, కుట్టుమిషన్లు, కూరగాయలు, పళ్ళు, టిఫిన్లు అమ్మే వారికి తోపుడుబండ్లు అందజేస్తున్నామన్నారు. ఇవే కాకుండా తరచూ సామాజిక సేవా కార్యక్రమాలను ధర్మారావు ఫౌండేషన్ ద్వారా చేస్తున్నామన్నారు. బీసీలకు మా ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నామన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మూడు మండలాలకు మండల అధ్యక్షుల పదవులను బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగిందన్నారు. ఎఏంసి చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ లేనివిధంగా మొట్టమొదటిగా బలహీనవర్గాల అభివృద్ధికి పదవులు ఇవ్వడంతో పాటు వైస్ చైర్మన్ గా దాసరి రత్నకు రాజుకు పదవిని ఇవ్వడం జరిగిందన్నారు. సామాజిక న్యాయం నూటికి నూరు శాతం అందజేయడానికి కట్టుబడి ఉన్నాం అన్నారు. గౌడ, శెట్టిబలిజ భవన నిర్మాణం కలగా మిగలకూడదని స్థల వివాదాన్ని పరిష్కరించి రూ.1.50 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించడం, తదనంతరం 2019 నుండి 5 సంవత్సరాల కాలంలో ఆ భవనానికి సంబంధించి పని కూడా కూడా చేపట్టడం జరగలేదన్నారు. నారా లోకేష్ పాలకొల్లు పట్టణలో నిర్వహించిన యువగళo సందర్భంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భన నిర్మాణాన్ని చేపడతామని తెలియజేశారని, అలాగే గాంధీ బొమ్మ సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో కూడా చెప్పినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి మూడు కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే అగ్నికుల క్షత్రియలకు కూడా భవన నిర్మాణానికి మూడు కోట్ల రూపాయలను మన రాష్ట్ర ముఖ్యమంత్రిచే మంజూరు చేయించుకోవడం జరిగిందని, ఆ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిపాజిట్ చేయించి తదుపరి పనులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. బీసీ, ఎస్సీ వర్గాలకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. బీసీ, ఎస్సీ వర్గాల రుణం తీర్చుకునే బాధ్యత నాపై ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తూర్పు కాపులకు కూడా భవన నిర్మాణం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. సృజనాత్మకత ఉంటేనే చేతివృత్తుదారులుగా రాణించగలరని, మనం వారు చేసే పనులను ట్రై చేసిన అవి కుదరవని, మంత్రి చేసిన కొన్ని పనులను ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీ వర్గాలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పూర్తి ఆదరణ ఉంటుందని ఈ సందర్భంగా కొనియాడారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా జరుపు కుంటున్నామన్నారు. సుమారుగా రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటూ జయంతి వేడుకలు జరుపుకుటున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనం తెలుసుకోవచ్చనన్నారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తిని తీసుకొని యువత ముందుకు నడవాలని సూచించారు. వెనుకబడిన వర్గాల విద్య కోసం, మానవ హక్కుల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో పోరాడారని తెలిపారు. అత్యంత వెనుకబడిన కులాల వారిని అభివృద్ధి పరిచేందుకు పూలే ఎంతగానో కృషి చేశారని తెలిపారు. భారతదేశంలో ఉన్న మహా నాయకులందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి మహత్మా జ్యోతీరావ్ ఫూలే అన్నారు. మహిళలకు విద్య ఎంతో అవసరమని అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో తన భార్యకు ముందుగా విద్యనందించి ఆమె ద్వారా మహిళల విద్య వ్యాప్తికి ఎన్నో సంస్థలు ఆయన స్థాపించారన్నారు. రెండు వందల సంవత్సరాల క్రితమే బడుగు బలహీనల వర్గాల అభ్యున్నతికి సామాజిక న్యాయం అనే కొత్త ఆలోచన విధానాన్ని తీసుకువచ్చారన్నారు. ఈనాటికి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాల కొరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతగానో కృషి చేశారని వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని అన్నారు. సమాజంలో అసమానతలు తోలగడానికి పూలే ఎంతో శ్రమించారని ఆ దిశగా ప్రభుత్వం అసమానతలు తొలగించేందుకు, సమాజంలో అందరూ సమానంగా జీవించే విధంగా కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు.

చివరిగా జిల్లాలోని 400 మంది బిసి, ఇ.డబ్ల్యూ.ఎస్, కాపు కార్పొరేషన్ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు రూ.11.50 కోట్ల మెగా చెక్కును మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదగా అందజేశారు.

తొలుత గాంధీ బొమ్మ సెంటర్ నందు మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి గణపతి రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్, తహసిల్దార్ దుర్గా కిషోర్, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయ భాస్కరరావు, స్థానిక నాయకులు బోనం చినబాబు, జీవి, కె.గౌరు నాయుడు, కడలి గోపి, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, మామిడి శెట్టి పెద్దిరాజు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.