మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సన్న, చిన్నకారు రైతుల ఆర్థిక అభివృద్ధికి రైతుల పొలాల్లో పండ్లతోటల పెంపకం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.
మంగళవారం పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామపంచాయతీలో కలిదిండి సూర్యనారాయణ రాజు వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి మొక్కలను నాటి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సన్న, చిన్నకారు రైతులు ఆదాయ ఆర్జనతో పాటు, ఉపాధి కూలీలకు నిరంతరం పని కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అటవీ ప్రాంతాన్ని పెంపొందించడం, పండ్ల తోటలు పెంపకం ద్వారా సన్న చిన్నకారు రైతులకు ఆదాయాన్ని సమకూర్చాలనే ఆలోచనతో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అలాగే వ్యవసాయ పనులు లేని కాలంలో ఉపాధి హామీ కూలీలకు కూడా పని కల్పించడంలో పండ్ల తోటలు పెంపకం ఎంతో దోహదపడుతుందన్నారు. 25 సెంట్లు నుండి ఐదు ఎకరాల భూమి కలిగిన ప్రతి ఒక్క రైతు ఈ పథకానికి అర్హులని, మూడు సంవత్సరాల పాటు తోటల పెంపకంను జిల్లా నీటి యాజమాన్య సంస్థ పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అంతర పంటలు వేసుకుంటే మరింత ఆదాయాన్ని అర్జించడానికి తోడ్పడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఎకరాలలో ఉద్యానవన పంటల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి, మన జిల్లాకు 1500 ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 450 ఎకరాలలో సన్న, చిన్నకారు రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో ఉద్యానవన తోటలు పెంపకానికి నేడు ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. మామిడి, నిమ్మ, జామ, తైవాన్ జామ, సపోటా, కొబ్బరి, సీతాఫలం, దానిమ్మ, డ్రాగన్, ఆయిల్ ఫామ్, కోకో, గులాబీ, మల్లె, మునగ పంటల పెంపకానికి ఆసక్తి కలిగిన రైతుల వ్యవసాయ క్షేత్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలను నాటి మూడు సంవత్సరాల పాటు పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకాన్ని సన్న, చిన్న కారు రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ కే సిహెచ్ అప్పారావు, ఏపీడి పి.సుజాత, గ్రామ సర్పంచ్ భూపతి రాజు వంశీకృష్ణంరాజు, తహసిల్దార్ ఎన్.విజయలక్ష్మి, ఎంపీడీవో రెడ్డియ్య, హౌసింగ్ ఏ.ఇ వెంకటేశ్వరరావు, డ్వామా సిబ్బంది, గ్రామ ప్రజలు, ఉపాధి కూలీలు, తదితరులు పాల్గొన్నారు.