మహర్షి వాల్మీకి జీవితం, ఆయన రచనలు సమాజానికి స్ఫూర్తిదాయకం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
మహర్షి వాల్మీకి జీవితం, రచనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా శనివారం భీమవరం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి రచించిన రామాయణం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. రామాయణం ద్వారా మానవీయ విలువలు, ధర్మబద్ధమైన జీవనం, సత్యనిష్ఠ, కర్తవ్యపాలన వంటి గొప్ప సందేశాలను సమాజానికి అందించారని తెలిపారు. మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఆయన బోధనలు నేటి సమాజానికి కూడా ఎంతో మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ నైతిక విలువలను పాటిస్తూ, సమాజంలో మానవతా దృక్పథాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. గ్లోరియా, జిల్లా విద్యాశాఖ అధికారి అనిల్ కుమార్, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ అప్పారావు, బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ ఝాన్సీ లక్ష్మీబాయి, నర్సాపురం ఏబీసీడబ్ల్యూఓ ఇన్‌చార్జి విద్యాసాగర్, హాస్టల్ వార్డెన్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.