మద్యం షాపులు, పర్మిట్ రూముల వద్ద నూరు శాతం ప్లాస్టిక్ నిషేధాన్ని వారం రోజుల్లోపుగా అమలు చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
జిల్లాలో ఎక్కడ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో ఎక్సైజ్ శాఖ ప్రగతిపై ఎక్సైజ్ సర్కిల్స్ వారీగా సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యసాధనకు కృషి చేయాలని, మద్యం డిపోల నుండి ప్రతి లిక్కర్ షాపుకు మద్యం సరఫరా, అమ్మకాలను వివరాలను పరిశీలించాలన్నారు. లిక్కర్ షాపు యజమానుల ఆర్డర్ ప్రకారం డిపోల నుండి మద్యం సకాలంలో సరఫరా అవుతుంది లేనిది పర్యవేక్షించాలన్నారు. మద్యం షాపుల వద్ద సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగాన్ని, వాటర్ ప్యాకెట్లను నూరు శాతం నిషేధించాలన్నారు. భీమవరం పట్టణ సుందరీకరణలో భాగంగా వివిధ అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, భీమవరాన్ని ఒక డిగ్నిఫైడ్ పట్టణంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నమన్నారు. పట్టణంలో ఎక్కడా కూడా అనధికార ప్రదేశాలలో లిక్కర్ వినియోగం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా గంజాయి, తదితర మత్తు పదార్థాలు వినియోగం ఉండకూడదని, దీనిపై ప్రత్యేకనిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికె జిల్లాను సారా రహిత జిల్లాగా ప్రకటించుకోవడం జరిగిందన్నారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనలో ఎక్సైజ్ శాఖ అధికారులు సమర్థవంతంగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని అధికారులు ఆదేశించారు. జిల్లాలో సుంకం చెల్లించని మద్యం సరఫరా పై 10 కేసులను నమోదు చేయడం జరిగిందని, ఆకివీడులో ఒకటి, భీమవరంలో రెండు, తాడేపల్లిగూడెంలో ఒకటి, నరసాపురంలో ఒకటి, తణుకులో ఐదు నమోదు చేసి మొత్తం 1,126 లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే 130 లీటర్ల స్పిరిట్ సరఫరా పై పాలకొల్లులో ఒక కేసు నమోదు చేసి 13 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ మరియు ఇన్చార్జి జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి కె.వి నాగ ప్రభు కుమార్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్.వి ప్రసాద్ రెడ్డి, అజయ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కళ్యాణ్ చక్రవర్తి, బలరామరాజు, ఎం. శ్రీనివాసరావు, రాంబాబు, మణికంఠ రెడ్డి, స్వరాజ్యలక్ష్మి, సబ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.