Close

మట్టి వినాయకులను పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం– జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 25/08/2025

సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు వినాయకుని మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. నరసాపురం పట్టణానికి చెందిన విశ్వేశ్వర సేవా సదన్ డా.కంచర్ల కాశీ విశ్వేశ్వరరావు, శిరిపుష్ప దంపతులు తయారుచేసిన వినాయకుని మట్టి విగ్రహాలను కలెక్టరేట్ కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాల వలన జలవనరులు కలుషితమై ఎన్నో జీవరాసుల మనుగడ ప్రశ్నార్థముగా మారిందన్నారు. జిల్లా ప్రజలందరూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు భక్తిశ్రద్ధలతో మట్టితో తయారు చేసిన వినాయకుని విగ్రహాలను మాత్రమే పూజించాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడే సంకల్పంతో విశ్వేశ్వర సేవా సదన్
తమ వంతు కృషిగా ఎన్నో సంవత్సరాలుగా అనేక వేల మట్టి విగ్రహాలను తయారు చేసి ప్రజలకు అందించడం అభినందనీయమని, కంచర్ల కాశీ విశ్వేశ్వరరావు శిరీష దంపతులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర సేవా సదన్ కాశీ విశ్వేశ్వరరావు, శిరీష దంపతులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి దృశ్యాలువాతో సన్మానించి అభినందించారు.

విశ్వేశ్వర సేవా సదన్ నిర్వాహకులు డాక్టర్ కంచర్ల కాశీ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణానికి కొంతైనా మేలు చేద్దామనే ఆలోచనతో సుమారు 16 సంవత్సరముల నుండి మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి ప్రజలకు అందిస్తున్నమని అన్నారు. 55 నదీ జలాల నుండి తీసుకువచ్చిన జలములతో, సుగంధ ద్రవ్యాలతో మట్టిని కలిపి మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయటం జరుగుచున్నదన్నారు. విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల నుండి కాకుండా ఇతర దేశములకు కూడా మేము తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను తీసుకు వెళుతుంటారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఆయన వివరించారు.

ఈ విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, డిటి ఎం.సన్యాసిరావు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.