Close

మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని, ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 22/08/2025

శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి మరియు స్పేస్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన “పర్యావరణ అనుకూల వినాయక చవితి అవగాహన కార్యక్రమం” కు సంబంధించిన గోడపత్రికలను, కరపత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని, దీనిని దృష్టిలో ఉంచుకొని పర్యావరణానికి హితము చేసే మట్టి వినాయకులతోనే చవితి పండుగను జరుపుకోవాలని కోరారు. పర్యావరణహితమైన మట్టి వినాయకులను తయారు చేసేందుకు ప్రభుత్వ పాఠశాలలో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు అవగాహన కలిగించేందుకు ప్రతి పాఠశాలలో వినాయక చవితికి వినియోగించే పత్రి, తదితర విషయాలను తెలిపేలా గోడ పత్రికలను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. వినాయక చవితి పూజా పత్రితో ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు ఉంటాయన్నారు. వినాయకుని పూజించే 21 రకాల పత్రాలు, మన ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషదాలుగా చెప్పబడ్డాయన్నారు.

సహజరంగులతో చేసిన మట్టి ప్రతిమలతో పర్యావరణ అనుకూల వినాయక చవితి జరుపుకుందాం

వినాయక చవితి విశిష్ఠతను కాపాడేందుకు మనమందరము సమిష్టిగా కృషిచేయడం వల్ల ఒక గొప్ప మార్పును సాధించవచ్చు అని, సహజ రంగులతో మట్టి విగ్రహాలను తయారుచేయడం స్వచ్ఛతకు ఒక గొప్ప చిహ్నమే గాక ఖర్చులేనిది కూడా అని తెలిపారు. మనం చెరువులు లేదా జలవనరులకు నష్టం కలిగించే వ్యర్ధ పదార్థాల వినియోగం పూర్తిగా మానేద్దాం అన్నారు. త్రాగునీటి చెరువులు, సాగునీటి కాలువలు మరియు ఇతర జలాశయాలు భూమిమీద జీవరాశులకు ముఖ్యమైన ఒక జీవనాధారం అని వాటి సంరక్షణ మనందరి బాధ్యతగా తెలిపారు. వినాయక విగ్రహాల తయారిలో కృత్రిమ రంగులు మరియు విషపదార్థాల వినియోగం వలన జలవనరులు కాలుష్యానికి గురవుతున్నాయని, వీటి వలన జనవనరుల నాణ్యత తగ్గటంతోపాటు వృక్ష, జంతు జీవనంపై ప్రభావం కలుగుతుందన్నారు. నీటిలో విష రసాయన వ్యర్ధాలు కలపడం వల్ల ఊపిరితిత్తులతోపాటు, చర్మ రక్త మరియు కంటి సంబంధ వ్యాధులతోపాటు ఇతర వ్యాదులు వస్తాయన్నారు. లౌడ్ స్పీకర్ల వినియోగం తగ్గించడం ద్వారా శబ్ద కాలుష్యాన్ని తగ్గించవచ్చు అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించవద్దన్నారు. అలాగే విగ్రహాల అలంకరణలు ప్లాస్టిక్, ధర్మోకోల్, వంటి వస్తువులు వాడలం వలన జల వనరులు కలుషితమవుతాయని వీటి నియంత్రణ కూడా శ్రద్ధ వహించాలన్నారు.

జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.వెంకటేశ్వరరావు మట్టి వినాయకులతో పూజించడం, పత్రిని ఉపయోగించడం ద్వారా కలిగే ప్రయోజనాలపై ఇప్పటికే జిల్లా అంతట కళాజాతాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

స్పేస్ ఎన్జీవో ప్రెసిడెంట్ గోపిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ మావుళ్ళమ్మ గుడి ఆదివారం బజార్ నందు సోమ, మంగళవారాల్లో మట్టి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

గోడ పత్రిక ఆవిష్కరణలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.వెంకటేశ్వరరావు, ఏఈ ఎస్.రమేష్, ఎన్.వెంకటరమణ, స్పేస్ ఎన్జీవో ప్రెసిడెంట్ గోపిశెట్టి మురళీకృష్ణ, జిల్లా అటవీ శాఖ అధికారి ఆశా కిరణ్, జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి వై.దోసి రెడ్డి, నరసాపురం ఆర్డీవో దాసిరాజు, తదితరులు ఉన్నారు.