భీమవరం పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు సత్వరమే పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భవ్య భీమవరం, పారిశుధ్య నిర్వహణ, పార్కుల అభివృద్ధి, రోడ్ల ఆక్రమణల తొలగింపు, తదితర అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డిఓ కే. ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవ్య భీమవరం ప్రాజెక్టులో భాగంగా పట్టణంలో దాతల సహకారంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, ఇంకా ప్రారంభం కాని పనులు ప్రారంభించేందుకు దాతలతో సంప్రదించి పనులు ప్రారంభించేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న పాత బస్టాండ్ పనులు, పట్టణంలో పార్కులలో ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో రోడ్డు మార్జిన్లు ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నారని అటువంటి వారిని గుర్తించి తొలగించాలన్నారు. అదేవిధంగా అనుమతి లేకుండా ఎక్కడబడితే అక్కడ పెద్ద పెద్ద హోల్డింగులను ఏర్పాటు చేస్తున్నారని వాటిని తక్షణమే తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల పార్కింగ్కు ప్రదేశాలు గుర్తించి మార్కింగ్ చేయాలని ఆ ప్రదేశంలోనే వాహనాలు పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా రోడ్లపై వర్షం నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో వ్యాపార సంస్థలు, పాఠశాలలు, కళాశాలల వద్ద సీసీ కెమెరాలు ఆయా యాజమాన్యాల ద్వారా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య సిబ్బంది ఉదయం 5 గంటలకే విధులు ప్రారంభించాలన్నారు. తాను ఆకస్మికంగా పర్యటిస్తానని పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా త్రాగునీరు కలుషితం కారణంగా ప్రజలు డయేరియా బారిన పడకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధం ఉన్నందున ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా నిఘ పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. సూర్య ఘర్ పథకం కార్యక్రమంలో భాగంగా సోలార్ ప్యానల్ ఏర్పాటుకు ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. పట్టణంలో చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వచ్చే సమావేశం నాటికి పనులు ప్రగతిని, తాజా నివేదికలతో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డిఒ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, భీమవరం మునిసిపల్ కమీషనర్ కె.రామచంద్రా రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి ఫార్థసారధి, అసిస్టెంట్ కమీషనర్, హెల్త్ ఆఫీసర్, మున్సిపల్ ఇంజనీర్లు, డిఇలు పాల్గొన్నారు