భీమవరం పట్టణంలోని స్మశానవాటికను స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని భీమవరం మున్సిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గునుపూడి, బలుసుమూడి స్మశాన వాటికల అభివృద్ధి, మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్ల నిర్మాణాలపై మున్సిపల్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భీమవరం పట్టణంలోని గునుపూడి స్మశాన వాటిక అభివృద్ధి పనులను అత్యంత నాణ్యతతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో రూపుదిద్దాలన్నారు. గునుపూడి స్మశాన వాటిక సుమారు 1.9 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, దీని అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.56 లక్షల మంజూరు చేసి, వివిధ పనులకు టెండర్లు పిలిచి పూర్తి చేయడం జరిగిందని, త్వరలోనే పనులను ప్రారంభించడం జరుగుతుందన్నారు. స్మశాన వాటిక అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఖాళీ స్థలంలో లాన్ అభివృద్ధి పరచడం, పాత్ వే కు ఇరువైపులా అందమైన మొక్కలను పెంచడం, లాన్ ను నీటితో తడపడానికి స్ప్రింక్లర్లను, పాత్ వే మొక్కలకు డ్రిప్ సిస్టంను అమర్చాలన్నారు. ఈ సందర్భంలో మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ క్రిమినేషన్ కు 6 ప్లాట్ ఫామ్స్ ను గ్యాస్ లేదా విద్యుత్ తో నిర్మాణం, పెద్ద శివుని బొమ్మ, వెయిటింగ్ హాల్, షవర్సు, అస్తికలు భద్రపరిచే గది తదితర పనులు చేపట్టేందుకు అదనంగా సుమారు రూ.90 లక్షల వ్యయంతో చేపట్టేందుకు ప్రతిపాదనను సిద్ధం చేయడం జరిగిందని, వీటికి సిఎస్ఆర్ ఫండ్స్ నుండి నిధులను కేటాయించవలసిందిగా కోరడం జరిగింది. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్మశాన వాటిక పనులను అత్యంత నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, ఎక్కడ రాజీ పడటానికి లేదని తెలిపారు. స్మశాన వాటికలోనికి వెళితే ఆహ్లాదకరమైన పార్కును సందర్శించిన అనుభూతి కలగాలని, ఆ విధంగా పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. అలాగే బలుసు మూడి స్మశాన వాటిక మోక్షధామంలోనికి వెళ్లడానికి ఇరుకైన మార్గం ఉండడం ఇబ్బందిగా ఉందని, ఈ విషయమై మోక్షదామం వెళ్లే దారిలోని ఇరువైపులా స్థలాన్ని సర్వే చేయించాలన్నారు. ఇంకా స్థలం అవసరమైతే టీటీడీ నుండి పొందేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.
భీమవరం పట్టణంలో పింక్ టాయిలెట్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి…
కొత్త బస్టాండ్ ఔట్ గేట్ పక్కన పింక్ టాయిలెట్ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి పట్టణంలో మహిళల ప్రత్యేక అవసరాల కోసం పింకు టాయిలెట్ల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందన్నారు. వీటిని అత్యంత నాణ్యతతో, అందంగా నిర్మించి తీర్చిదిద్దాలని తెలిపారు. తణుకు బస్టాండ్ లో కూడా ఇప్పటికే పింక్ టాయిలెట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారి ఏ.అప్పారావు, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ టి.త్రినాధ రావు, డిఇలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.