భారీ వర్షాల కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా, 24/7 అందుబాటులో ఉండాలి.
అత్యవసర సమాచారాన్ని ప్రజలు, అధికారులు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ 08816 299181 నెంబర్ కు తెలియజేయాలి.
. . జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి.
జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం భారీ వర్షాల కారణంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఇరిగేషన్, డ్రైన్స్, వివిధ శాఖల జిల్లా అధికారులతో వెబ్ ఎక్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే రెండు రోజుల్లో జిల్లాలో భారీగా వర్షాలు కురియనున్న దృష్ట్యా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో ముంపునకు గురైన పంట పొలాలలోని నీరు బయటకు వెళ్లేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కాలువలు, డ్రైన్స్ ద్వారా వర్షపు నీరు ఎక్కడ ఆగకుండా సాఫీగా దిగువకు వేగంగా పారే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా కాలువలకు, డ్రైన్స్ కు గండ్లు పడకుండా బలహీనమైన చోట్ల గట్లను పటిష్టం చేయాలన్నారు. రాబోయే రెండు రోజుల్లో ఈ వర్షాలు కురియనున్న దృష్ట్యా ఎక్కడైనా గ్రామాలు ముంపున బారిన పడే అవకాశం ఉన్నట్లయితే ఆయా కుటుంబాల వారిని తక్షణమే సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే గుర్తించి ముందస్తుగా వారిని సమీప ఆసుపత్రులలో చేర్చాలన్నారు. ఎక్కడా కూడా వర్షపు నీరు నిలువ ఉండకుండా చూడాలన్నారు. త్రాగునీరు కలుషితం కారణంగా ఏ ఒక్కరూ అనారోగ్యం పాలు కాకుండా చూడాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు జిల్లాలోని సచివాలయ సిబ్బందిని షిఫ్ట్లు వారీగా విధులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు వర్షాలు తగ్గే వరకు క్షేత్ర స్థాయి పర్యవేక్షణలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర మందులు, క్లోరిన్, బ్లీచింగ్ తదితర సామాగ్రితో సిద్ధంగా ఉండాలని వైద్య శాఖ అధికారిని ఆదేశించారు. త్రాగునీరు, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి ఆదేశించారు. పట్టణాల్లో పల్లప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాల వారు భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైతే వారిని సురక్షత ప్రాంతాలకు తరలించేందుకు మున్సిపల్ కమిషనర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ముంపునకు గురయ్యే లంక గ్రామాలపై తహసిల్దార్ లో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అధికారులంతా జిల్లా ప్రధాన కేంద్రంలో ఉండాలని, ఏ ఒక్కరికి సెలవులు మంజూరు చేయడం జరగదన్నారు. ఇప్పటికే జిల్లాలో వర్షాల కారణంగా ఎక్కడైనా పంట ముంపునకు గురైతే సంబంధిత వివరాలు, ముంపునకు దారి తీసిన పరిస్థితులపై ఒక నివేదిక అందజేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, 24/7 డ్యూటీ లో సిబ్బంది ఉంటారని, అత్యవసర సేవల కోసం ప్రజలు, అధికారులు కాల్ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.