భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తుఫాను, వరదల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

Publish Date : 24/10/2026
WhatsApp Image 2026-10-24 at 8.52.37 PM

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తుఫాను, వరదల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

శనివారం గూగుల్ మీటింగ్ ద్వారా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బి, ట్రాన్స్‌కో, విద్య, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, వ్యవసాయ, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తదితర శాఖల అధికారులతొ తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని, అత్యవసర సేవలకు అవసరమైన సిబ్బంది, పరికరాలు, సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ నివసిస్తున్న ప్రజలను అవసరమైన సందర్భాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ముఖ్యంగా లంక గ్రామాల్లోని వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అవసరమైన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, అక్కడ తాగునీరు, పాలు, ఆహారం, వైద్య సేవలు, పారిశుద్ధ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కంట్రోల్ రూమ్‌లు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి.

జిల్లా స్థాయిలో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్
ఫోన్ number 08816299181 ఏర్పాటు చేయడంతో పాటు, అన్ని మండల కేంద్రాల్లో ఇప్పటికే ఉన్న కంట్రోల్ రూమ్‌లను అప్రమత్తం చేయాలని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అత్యవసర సమాచారంపై వెంటనే స్పందించేలా సిబ్బందిని అందుబాటులో ఉండాలని తెలిపారు.

తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. తుఫాను, వరదల సమయంలో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

**కాలువలు, డ్రైనేజీలను ముందుగానే శుభ్రం చేయాలి.

భారీ వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండకుండా ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాలువలు, డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడిక, తూడు, తూటికాడ తదితర అడ్డంకులను తొలగించి, వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా చూడాలన్నారు.
నీరు నిల్వ ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ నీటి నిల్వను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా మోటార్లు, ఇతర అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

**రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు.

భారీ వర్షాల వల్ల జాతీయ రహదారులు, ప్రధాన రహదారులు, ఇతర రహదారులు దెబ్బతిన్నా, నీటితో మునిగినా వెంటనే స్పందించి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సంబంధిత రహదారుల శాఖ అధికారులకు తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా రహదారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రమాదకర ప్రాంతాల వద్ద అవసరమైన హెచ్చరికలు ఏర్పాటు చేయాలని సూచించారు.

**విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకూడదు.

భారీ వర్షాలు, తుఫాను సమయంలో తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, తీగలు దెబ్బతినే ప్రమాదం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు వెంటనే పునరుద్ధరించేలా సిబ్బంది, పరికరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. తుఫాను సమయంలో పారిశుద్ధ్య సిబ్బంది విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన నీటి నిల్వలు, ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు.

**పాఠశాలలు, కళాశాలల విషయంలో ముందస్తు చర్యలు.

అక్టోబర్ 27, 28 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అంశంపై నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు తెలిపారు. అన్ని ఇంజినీరింగ్ కళాశాలలు సహా ఇతర విద్యాసంస్థలకు కూడా పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు సమాచారం అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

**రైతుల పంటలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు.

భారీ వర్షాల కారణంగా వ్యవసాయ భూముల్లో నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులను ఆదేశించారు. పంట పొలాల్లో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చోట్ల నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
పంట పొలాలు ముంపునకు గురికాకుండా, రైతులు నష్టపోకుండా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.

**మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని తెలిపారు. సముద్రంలో వాతావరణ పరిస్థితులపై సంబంధిత శాఖలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, మత్స్యకారులకు హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని తెలిపారు.

**పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి

భారీ వర్షాల అనంతరం వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందికి అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీలను నిరంతరం శుభ్రం చేయాలని తెలిపారు.

**అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు.

అక్టోబర్ 27, 28 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు మినహా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలో తుఫాను, భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.