Close

భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న రెండు రోజులు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రైతుల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 29/11/2025

శనివారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ దిత్వ తుఫాను కారణంగా జిల్లాలో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు ఇప్పటికే కోసిన పంటను జాగ్రత్త చేసుకోవాలన్నారు. ధాన్యం నూర్పిడి అయితే వెంటనే ధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా అమ్మకాలు చేయాలన్నారు. వరి కోతలను మూడు రోజులు పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. జిల్లాలో గోనె సంచులు కొరతలేదని, ఆర్ఎస్కే లలో సిద్ధంగా ఉంచడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 1.12 లక్షల రైతులకు సంబంధించి 2.11 లక్షల ఎకరాల్లో పంట ఈ పంట నమోదు చేయడం జరిగిందని, సుమారు 6.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. దీనిలో స్థానిక వినియోగం, బహిరంగ మార్కెట్లో అమ్మకాల పోను 5.64 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అంచనాలు ఉన్నాయన్నారు. ఖరీఫ్ సీజన్ కు 5.00 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. 215 ఆర్ఎస్కే ల ద్వారా 17,640 మంది రైతుల నుండి నేటికి 1.32,453 మెట్రిక్ టన్నుల రూ.313.78 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, దీనిలో 297.19 కోట్ల నగదును రైతుల ఖాతాలలో 24 గంటల్లోపే జమ చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని 202 రైస్ మిల్లులు రూ.404 కోట్లు బ్యాంకు గ్యారంటీలను విడుదల చేయడం జరిగిందన్నారు. జిల్లా మొత్తం 307 ధాన్యం కొనుగోలు సెంటర్లను రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లా మొత్తం 201 రైస్ మిల్లు ఉన్నాయని, మనకు 1.25 కోట్ల గోనే సంచులు అవసరం ఉన్నాయని తెలిపారు. పట్టుబడి ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు 3,100 వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తీర మండలాలు అయిన నరసాపురం, మొగల్తూరు, భీమవరం, పాలకొల్లు పరిసరాలలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున సకాలంలో పొలములోని నీరు బయటకు పోవుటకు డ్రైనేజి ఏర్పాట్లు చేసుకోవాలని, గాలి వేగాలు పెరిగే అవకాశమున్నందున, గాలి వేగానికి వరి మొక్కలు వాలిపోయే అవకాశం ఉన్నందున ముందుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో రైతులు వారి యొక్క ధాన్యం సురక్షిత ప్రదేశములకు తరలించుకోవలసినదిగాను మరియు వర్షం కురిసిన యెడల నీళ్ళు చొరబడకుండా టార్పాలిన్లు కప్పుకుని ధాన్యాన్ని భద్రపరచుకోవలసినదిగా తెలియజేసినారు. జిల్లాలో ఉన్న అన్నీ సొసైటీలలో దాదాపుగా 10,000 టార్పాలిన్లు ఉచిత ప్రాతిపదికన రైతుల అవసరాల నిమిత్తం కోతలు పూర్తి అయ్యి ధాన్యం ఆరబెడుతున్న రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరూ కూడా అకాల వర్షాల విషయములో ఎటువంటి పుకారులను, అవాస్తవాలను నమ్మవద్దని అలానే రైతులు వారి ధాన్యం విక్రయించుకోనుటకు ఎటువంటి దళారిల జోక్యం లేకుండా నేరుగా వారి సంబంధిత రైతు సేవా కేంద్రమును సంప్రదించవలసినదిగా విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలు, రవాణా, తూకం మొదలైన అంశాలపై ఏ సందేహాలైనా ఉంటే వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని, క్షేత్ర స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉన్న యెడల జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన, ధాన్యం కంట్రోల్ రూమ్ నెంబర్లు 81216 76653, 1800 425 1291 లకు ఫోన్ చేసి నేరుగా సమస్యను తెలియజేయాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ ఎండి ఇబ్రహీం, డీఎస్ఓ ఎన్.సరోజ, ఏ ఎస్ ఓ శివ శంకర్, జిల్లా మార్కెటింగ్ అధికారి సునీల్ కుమార్, జిల్లా రవాణా అధికారి కృష్ణారావు, జిల్లా రైసుమిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సామంతపూడి శ్రీరామరాజు, తదితరులు పాల్గొన్నారు.