భారత రాజ్యాంగం పితామహుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని రాష్ట్ర ఉప శాసన సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం భీమవరం అంబేద్కర్ సర్కిల్ నందు వున్న విగ్రహానికి రాష్ట్ర ఉప శాసనసభ పతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. భారతదేశం ఇంత ఐక్యంగా ఉన్నది అంటే ఆయన ప్రవేశపెట్టిన రాజ్యాంగమే కారణమన్నారు. అయన వర్ధంతికి, జయంతికి పరిమితం కాని ఒకే ఒక్క గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ రోజున ఆయన విగ్రహం లేని గ్రామం అంటూ లేదని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను దేశ ప్రజలందరూ ఇంతగా గౌరవిస్తున్నారంటే ఆయన వ్యక్తిత్వం, సమానత్వం ఆయన రాజ్యాంగంలో చూపించారన్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో 150 అడుగుల విగ్రహాలను నిర్మించటం జరిగిందని అన్నారు. రాజ్యాంగంలో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు ప్రపంచంలో ఏ రాజ్యాంగంలోనూ లేవు అన్నారు. ప్రపంచ దేశాలలో భారత దేశ రాజ్యాంగమే గొప్పది అన్నారు. ఎన్నో వర్గాలు, జాతులు, కుల, మతాలను సమన్వయ పరుస్తూ ఒక అద్భుతమైన రాజ్యాంగం సృష్టించి ఎన్నో సంస్కరణలు రాజ్యాంగంలో పొందుపరిచి భారతదేశానికి ఒక ఫెడరల్ విధానమును తీసుకుని వచ్చిన గొప్ప రాజనీతిజ్ఞుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించడమే కాకుండా స్వాతంత్ర్యం తరువాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకువెళ్లడానికి కీలకపాత్ర పోషించారన్నారు. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి న్యాయశాఖ మంత్రి అయ్యారని అన్నారు. ఆయన పదవీకాలంలో సామాజిక, ఆర్థిక సంస్కరణలు రూపొందించి పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని అన్నారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆ మహనీయుని ఆశయాల బాటలో ప్రతి ఒక్కరు నడవాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.