Close

భవ్య భీమవరానికి మరో మణిహారంగా నిలవనున్న డిజిటల్ లైబ్రరీ, చిల్డ్రన్ పార్క్–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 30/12/2025

నేడు శంకుస్థాపన.. మరో ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్న విజ్ఞాన, వినోద కట్టడాలు

భవ్య భీమవరానికి శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ డాక్టర్ బి వి రాజు ఫౌండేషన్ సహకారంతో భీమవరం పట్టడం నడిబొడ్డున ప్రజలకు, చిన్నారులకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే రూ.1.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కట్టడాలు అందుబాటులోకి రానున్నాయి. మంగళవారం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆర్.యు.బి కి యనమదుర్రు డ్రైన్ కి మధ్య పట్టాలకు ఇరువైపులా ఖాళీగా ఉన్న ముందు స్థలం 47 సెంట్లులో “బాలల వినోద ఉద్యానవనం”, వెనుక స్థలం 39 సెంట్లులో కమ్యూనిటీ లైబ్రరీ ప్రాజెక్ట్ నిర్మాణాలకు నేడు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, విష్ణు కాలేజ్ స్టూడెంట్స్ ఎఫైర్స్ డైరెక్టర్ పి.శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు. తొలుత శాస్త్రోక్తంగాపూజలు జరిపి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా భవ్య భీమవరం పేరిట దాతల సహకారంతో ఎన్నో కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. భీమవరం పట్టణంలో ప్రధానంగా పాత బస్టాండ్ నూతన కాంప్లెక్స్ నిర్మాణం, కాటన్ పార్క్ అభివృద్ధి, హౌసింగ్ బోర్డు పార్కుల అభివృద్ధి, డివైడర్ల కు పెయింటింగ్ పనులు, వివిధ పార్కుల అభివృద్ధి చర్యలు, సెంట్రల్ లైటింగ్, గాంధీ విగ్రహం వద్ద ఫౌంటెన్, గ్రీనరీ అభివృద్ధి, సోలార్ లైటింగ్ ఏర్పాటు, తదితర పనులను దాతల సహకారంతో చేపట్టడం జరిగిందన్నారు. నేడు డాక్టర్ బీవీ రాజు ఫౌండేషన్ దాతృత్వంతో రూ.1.6 కోట్ల వ్యయంతో కమ్యూనిటీ లైబ్రరీ, బాలల వినోద ఉద్యానవనం నిర్మాణాలను చేపట్టేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. లైబ్రరీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు, పుస్తక ప్రియులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అలాగే బాలల వినోద ఉద్యానవనం పట్నంలోని పిల్లలకు ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుందని, పిల్లల ఆటపాటలకు పట్టణంలో సరైన ఉద్యానవనం లేదని ఈ సందర్భంగా అన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ దాతల ప్రోత్సాహం, పర్యవేక్షణలో భవ్య భీమవరం పేరిట ఎన్నో పనులను చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. మరిన్ని పనులు చేపట్టేందుకు దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీవో అండ్ మున్సిపల్ ఫ్రెష్ ఆఫీసర్ కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కే.రామచంద్రారెడ్డి, బివి రాజు కళాశాల స్టూడెంట్స్ ఎఫైర్స్ డైరెక్టర్ పి.శ్రీనివాసరాజు, మున్సిపల్ ఇంజనీర్ లు, తదితరులు పాల్గొన్నారు.