Close

భవ్య భీమవరం పేరిట చేపట్టిన అభివృద్ధి పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి అయ్యేలా కృషి చేయాలని దాతలు, అధికారులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 17/07/2025

గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భవ్య భీమవరం అభివృద్ధి పనులపై దాతలు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఇప్పటికే పనులు ప్రారంభించి ఆరు నెలలు దాటిందని, వచ్చే ఆగస్టు 15 నాటికి పనులను పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు. భీమవరం పాత బస్టాండ్ పనులపై సమీక్షిస్తూ ఇంకా ఏమేమి పనులు పూర్తి చేయవలసి ఉందని ఆరా తీశారు. అలాగే హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆదిత్య పార్క్ పనులను ఆగస్టు 15 నాటికి పూర్తిచేసి జిల్లా ఇన్చార్జి మంత్రి, జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవం చేయనున్నట్లు సూత్రపాయంగా తెలిపారు. మూడు ఎకరాలు విస్తీర్ణం కలిగిన మారుతినగర్ పార్కు నందు వాకింగ్ ట్రాక్, బ్యూటిఫికేషన్ తో పాటు స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. కాస్మోపాలిటన్ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేయనున్న వంశీకృష్ణ నగర్ పార్క్ పనులను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలన్నారు. పార్కు నందు వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునే గేమ్స్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్ ఆర్ కె ఆర్ ఎదురుగా బస్సు బే ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. గునుపూడి స్మశాన వాటిక మోక్షదాం అభివృద్ధి పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని తెలిపారు. కాటన్ పార్క్ ఎడమవైపు వంతెన దగ్గర నుండి అడ్డవంతెన వరకు ఉన్న కాలవ గట్టు ఖాళీ స్థలానికి చైల్డ్ ఫెన్సింగ్ వేయడంతో పాటు వివిధ రకాల మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. అంబేద్కర్ సర్కిల్ ఆర్.యు.బి కుడి వైపు ఖాళీ స్థలంలో వాకింగ్ ట్రాక్, ఎంటర్టెన్మెంట్ & ప్లేయింగ్ గేమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్లాస్టిక్ నిషేదించలేరా? పట్టణ ప్రజలకు సురక్షితమైన మంచినీటి అందించలేరా? జిల్లా కలెక్టర్…

ప్లాస్టిక్ నిషేధాన్ని ఆరు నెలల క్రితమే ప్రారంభించిన ఇంకా ఎందుకు కట్టుదిట్టం చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. గుర్తు చేసినప్పుడు తనిఖీలు చేసి హడావిడి చేయడం కాదని, ఇది నిరంతర ప్రక్రియలా కొనసాగాలన్నారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లు కనిపిస్తే సంబంధిత శానిటరీ సెక్రటరీలపై చర్యలు తప్పవన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద నుండే బ్యాగును తెచ్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు. చెత్త వేయడం, ప్లాస్టిక్ వినియోగంపై చేయవలసినవి, చేయకూడనవి ప్రచార కరపత్రాలను ప్రతి షాపు ముందు అంటించడంతోపాటు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై ఇప్పటికే షాపులు, తోపుడుబండ్లు తదితరులకు చాలా సమయం ఇవ్వడం జరిగిందని, ఇకనుండి ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని, పెనాల్టీలను కూడా విధించాలని ఆదేశించారు. కాస్మోపాలిటన్ క్లబ్ నిర్వాహకులు బల్క్ వేస్ట్ జనరేటర్ ను ఏర్పాటు చేసుకోవాలని, మిమ్మల్ని చూసి మరి కొంతమంది ఏర్పాటుకు ముందుకు వస్తారు అన్నారు.

పింక్ టాయిలెట్స్ నిర్మాణంలో అలసత్వం వహిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం…

మహిళలు, గర్భవతులు, పాలిచ్చే తల్లులు, యువతుల కోసం ప్రతి పట్టణంలో చేపట్టాల్సిన పింక్ టాయిలెట్ నిర్మాణంలో అవరోధాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్, ఎంహెచ్ఓ, ఆర్డిఓలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు. ఇప్పటికే తణుకు బస్టాండ్ నందు శంకుస్థాపన చేసిన పింక్ టాయిలెట్ నిర్మాణానికి వివిధ సాకులు చూపిస్తున్న ఆర్టీసీ ఆర్ఎంపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాలలో భాగంగా ముఖ్యంగా మహిళల కోసం పింక్ టాయిలెట్ల నిర్మాణాన్ని చేపడితే ఎందుకు వివిధ కారణాలను సాకుగా చూపిస్తున్నారని, పింక్ టాయిలెట్ ల నిర్మాణం వలన ఎవరికి ఇబ్బంది అని, బస్టాండ్ కు వచ్చి వెళ్లే మహిళ ప్రయాణికులకు ఇది అవసరం కాదా అని గట్టిగా నిలదీశారు. ఉచితంగా నిర్మించి ఇస్తామంటే ఏవేవో సాకులు చెప్తున్నారన్నారు. భీమవరం బస్టాండ్ సమీపంలో ఇప్పటికే గుర్తించిన స్థలంలో పింకు టాయిలెట్ నిర్మాణాలకి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రజారోగ్యంపై మరింత శ్రద్ధ వహించండి

ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రభులే అవకాశం ఉందని, పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా పని చేయాలన్నారు. త్రాగునీటి పైప్ లైన్ లు లీకేజీలు అరికట్టి సురక్షితమైన త్రాగునీటిని అందించాలని, తాగునీటి సరఫరాపై ఫిర్యాదులు రాకూడదన్నారు.

అనుమతి లేని బ్యానర్స్, హోర్డింగ్స్ ను వెంటనే తొలగించాలి..

పట్టణ అందం కనిపించనంతగా ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్లను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇది ప్రతిరోజు చేయవలసిన కార్యక్రమంగా సూచించారు. అలాగే మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించేలాగా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారి టి.త్రినాధరావు, మున్సిపల్ డిఇలు, ఏఈలు, టిపిఓ, టౌన్ సర్వేయర్, ఆర్ అండ్ బి అధికారి, వివిది అభివృద్ధి పనులు చేపట్టిన దాతలు, తదితరులు పాల్గొన్నారు.