Close

బేడ (బుడ్గ) జంగం పిల్లలు చదువుకునేందుకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 24/02/2025

సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలెక్టరేట్లో కలిసిన వీరవాసరం మండలం పెర్కిపాలెం గ్రామానికి చెందిన బేడ (బుడ్గ) జంగం కుటుంబాల్లోని పిల్లలతో జిల్లా కలెక్టర్ ఉత్సాహంగా మాటామంతి కలిపి చదువుకోవడానికి ప్రోత్సహించారు. బేడ జంగం కుటుంబాలు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు ఆ కుటుంబాలకు చెందిన మహిళలు, పిల్లలు జిల్లా కలెక్టర్ ను కలిసి విన్నవించడం జరిగింది. కుల దృవీకరణ పత్రం లేని కారణంగా చదువుకోడానికి పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా చెడు అలవాట్లకు లోనవుతున్నారని ఆ కులంలోని విద్యాధికుడు కుమారి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ బేడ జంగం కులస్తులకు ఎస్సీ కుల ధ్రువీకరణ అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని, మీ విజ్ఞప్తిని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది అన్నారు. ఈ లోపుగా పిల్లలందరిని బడికి పంపాలని, అర్హతను బట్టి కొంతమందిని వసతి గృహాల్లో, ఆరు సంవత్సరాల వయసు లోపు కలిగిన పిల్లలను బాల సదన్ లో చేర్పించడానికి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ, ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లాకు కొత్తగా బాల సదన్ కేటాయించడం జరిగిందని, పిల్లలకు రక్షణగా ఉండాలంటే ప్రభుత్వ వసతి గృహాల్లో మాత్రమే చేర్పించాలని కలెక్టర్ ను కలవడానికి వచ్చిన మహిళలకు అవగాహన కల్పించారు. పిల్లలను పేరుపేరునా వారి పేర్లను అడిగి ముద్దు చేస్తూ చదువుకుంటారా అని వారిని ప్రశ్నించడం జరిగింది. పిల్లలందరూ చదువుకుంటామని బదులిచ్చారు. వీరే కాకుండా జిల్లాలో ఎస్టీ కులాలకు చెందిన కుటుంబంలోని పిల్లలను తక్షణమే గుర్తించి వారు చదువుకుంటున్నారా, పనులకు వెళ్తున్నారా అనే అంశాలపై నివేదికను వెంటనే అందజేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీ కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు కల్పిస్తామని, పిల్లలను చదువు మాన్పించవద్దు తల్లిదండ్రులకు సూచించారు. బడికి వెళ్లడం మానవద్దని, చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని పిల్లలకు హితవు పలికారు. మహిళలతో మాట్లాడుతూ మీరు డ్వాక్రా గ్రూపులలో ఉన్నారా, ప్రభుత్వం నుండి రుణాలు పొందుతున్నారా అని ప్రశ్నించారు. డ్వాక్రా గ్రూపులో ఉన్నామని, డ్వాక్రా రుణాలను మాత్రమే పొందుతున్నామని, కానీ ప్రభుత్వం నుండి ఏ విధమైన లబ్ధిని అందుకోలేపోతున్నామని విన్నవించారు. మీ అభివృద్ధికి ప్రభుత్వం పరంగా అందజేసే పథకాలను వర్తింపచేసేలా చూస్తానని, మీ పిల్లలను బడి మాన్పించవద్దని, కచ్చితంగా బడికి పంపాలని తెలిపారు.

ఈ సందర్భంలో జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు, డీఈవో ఇ.నారాయణ, ఐసిడిఎస్ నోడల్ అధికారి విజయలక్ష్మి, బేడ జంగం హక్కుల పోరాట సమితి సభ్యులు కుమారి శ్రీనివాస్, కుమారి సత్యనారాయణ, కుమారి శ్రీను, నీలపనేని సైదేశ్వర రావు, యేసు, మహిళలు, పిల్లలు, తదితరులు ఉన్నారు.

1.33