బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు.
*నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి స్టాక్ సీజ్ చేస్తాం.
**ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలకే బియ్యం విక్రయించాలి. నిల్వల పరిమితులు తప్పనిసరిగా పాటించాలి.
**సోమవారం నుంచి జిల్లాలోని ప్రతి మండలంలో ధరణి బియ్యం విక్రయ కేంద్రాలు – కిలో రూ.49కే నాణ్యమైన బియ్యం పంపిణీ.
**-ఇంచార్జి జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ.
బహిరంగ మార్కెట్లో బియ్యం ధరల పెరుగుదలను అరికట్టి, సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఇంచార్జి జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ తెలిపారు.
శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. బియ్యం ధరల నియంత్రణ, నిల్వల పరిమితులు, ధరణి బియ్యం విక్రయ కేంద్రాల నిర్వహణపై ఇంచార్జి జిల్లా కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు ఇష్టానుసారంగా పెంచి విక్రయించకుండా ప్రభుత్వం నిర్దిష్ట గరిష్ట చిల్లర ధరలను నిర్ణయించిందన్నారు. డి-మార్ట్, రిలయన్స్, విజేత వంటి పెద్ద రిటైల్ సంస్థలతో పాటు జిల్లాలోని అన్ని హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని స్పష్టం చేశారు. వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేయడం, కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా బియ్యం నిల్వ చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట బియ్యం ధరలు
బియ్యం రకాలను బట్టి ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధరల వివరాలు కిలోకు ఈ విధంగా ఉన్నాయి.
1. బిపిటి 3291 (సోనా), బిపిటి 5204 (సాంబ) రకం రూ.66/- లు 2. హెచ్.యంటి, ఆర్. ఎన్. ఆర్ రకం రూ.76/-లు,
3. జై శ్రీరామ్ రకం రూ.82/-లు
4. యం.టి.యు కామన్ రకం రూ.47/-లు
ఈ ధరల వివరాలను అన్ని వ్యాపార సంస్థల్లో ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని పేర్కొన్నారు. నిర్ణీత ధరలకు మించి విక్రయాలు జరగకుండా విజిలెన్స్, యం ఆర్ ఓ లు, సంబంధిత అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
**బియ్యం నిల్వలపై ప్రత్యేక నిఘా, స్టాక్ పరిమితులు తప్పనిసరి.
అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతను అరికట్టేందుకు ప్రభుత్వం వ్యాపార కేంద్రాల వారీగా స్టాక్ పరిమితులను నిర్దేశించిందని తెలిపారు.
**ట్రేడింగ్ రైస్ మిల్లులు: సి యం ఆర్, ప్రభుత్వ నిల్వలకు మినహాయింపునిస్తూ అన్ని ప్రాంతాల్లో 4,000 క్వింటాళ్లు లేదా ఏడు రోజుల మిల్లింగ్ సామర్థ్యం, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ పరిమితి మేరకు నిల్వలు ఉంచుకోవచ్చు అని తెలిపారు.
**హోల్‌సేలర్లు:
కార్పొరేషన్ పరిధిలో 1,000 క్వింటాళ్లు.
ఇతర జిల్లా కేంద్రాల్లో 500 క్వింటాళ్లు.
మిగిలిన ప్రాంతాల్లో 250 క్వింటాళ్లు.
**రిటైలర్లు:
పట్టణ ప్రాంతాల్లో 100 క్వింటాళ్లు.
గ్రామీణ ప్రాంతాల్లో 50 క్వింటాళ్లు.
నిర్దేశించిన స్టాక్ పరిమితులకు మించి బియ్యం నిల్వలు ఉంచకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. వ్యాపారులు తమ వద్ద ఉన్న బియ్యం నిల్వల వివరాలను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.
**నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, సరుకు సీజ్.
బియ్యం ధరలు, నిల్వల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి వ్యాపారి తప్పనిసరిగా పాటించాలన్నారు. నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు విక్రయించినా, అనుమతించిన పరిమితులకు మించి అక్రమ నిల్వలు ఉంచినా, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉల్లంఘనలకు పాల్పడిన వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన సరుకును సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
ఆర్డీవోలు, తహసీల్దార్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి హోల్‌సేల్, రిటైల్ దుకాణాలు, రైస్ మిల్లులను తనిఖీ చేయాలని సూచించారు. ఎక్కడైనా అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నట్లు లేదా అక్రమ నిల్వలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
**ప్రతి మండలంలో ధరణి బియ్యం కౌంటర్లు, కిలో రూ.49కే నాణ్యమైన బియ్యం.
సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణి బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.
జిల్లాలో గత నెల నుంచి మూడు రైతుబజార్లలో ధరణి బియ్యం కౌంటర్లను నిర్వహిస్తున్నామని, బహిరంగ మార్కెట్లో కిలో రూ.66 ధర పలికే నాణ్యమైన బియ్యాన్ని ఈ కేంద్రాల ద్వారా కేవలం రూ.49కే ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. ఈ కేంద్రాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.
ప్రజలకు మరింత చేరువగా ఈ సేవలను విస్తరించేందుకు వచ్చే సోమవారం నుంచి జిల్లాలోని ప్రతి మండలంలో అనువైనచోట ధరణి బియ్యం విక్రయ కౌంటర్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి, సరిపడా బియ్యం నిల్వలు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ప్రజలు తమ ఆధార్ నంబర్ ఆధారంగా ఒక్కొక్కరు ఒకేసారి గరిష్టంగా 26 కిలోల నాణ్యమైన బియ్యాన్ని కిలో రూ.49 చొప్పున కొనుగోలు చేయవచ్చని తెలిపారు. అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
**ప్రజలకు సరసమైన ధరలకు బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలను నియంత్రించడంతో పాటు, ప్రభుత్వ ఆధ్వర్యంలో తక్కువ ధరకు నాణ్యమైన బియ్యాన్ని అందించడం ద్వారా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో బియ్యం ధరల నియంత్రణ, నిల్వల పర్యవేక్షణ, ధరణి బియ్యం కౌంటర్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు
తోలుత మురుసు తుఫాను ప్రభావానికి గురైన జిల్లాలో ని 21,228 మంది బాధిత కుటుంబాలకు చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యవసర సరుకులు అయిన బియ్యం, నూనె, పంచదార, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంప పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలిపారు. జిల్లాలో ని ఆర్డీవోలు, తహసిల్దార్లు సక్రమంగా పంపిణీ అయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు.