బాల సంజీవిని కిట్లను సకాలంలో అంగన్వాడి కేంద్రాలకు అందేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా స్థాయి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం మానిటరింగ్ రివ్యూ కమిటీ సమావేశాన్ని సంబంధిత కమిటీ సభ్యులతో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీల కేంద్రాల ద్వారా గర్భిణీలకు బాలింతలకు ప్రభుత్వం ప్రతి నెల అందిస్తున్న పోషకాహార సరుకులను నాణ్యతతో, నిర్ణీత సమయానికి అందజేయాలన్నారు. అలాగే బాల సంజీవని కిట్లను ముందుగానే అంగన్వాడీ కేంద్రాలకు చేరేలా పరివేక్షించాలన్నారు. బాల సంజీవిని కిట్లు ద్వారా సరఫరా చేసే రాగి పిండి, అటుకులు, వేరుశెనగ చిక్కిలు, బెల్లం, ఎండు ఖర్జూరం ఐదు రకములతో కూడిన ప్యాకెట్, మరియు రైసు ,కందిపప్పు, ఆయిల్, ప్రతి నెల సక్రమముగా అందుతున్నాయా ఏమైనా లోటు పాట్లు ఉంటున్నాయని కమిటీ సభ్యులను ఆరా తీశారు. గర్భిణీలకు పిల్లలకు అందించే ఆహారంలో ఎటువంటి నాణ్యత లోపం ఉండకూడదని అన్నారు. ఒకటో తేదీ నాటికి లబ్ధిదారులు అందరికీ సరుకులను అందజేయాలని ఆదేశించారు. సరుకులు అందజేయడంలో ఎటువంటి ఆలస్యం చేయకుండా ముందుగానే సరుకులను గోదాములకు వచ్చేలా చూసుకోవాలని సప్లయర్స్ను ఆదేశించారు. పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే సరుకులు సక్రమంగా అందేలా చూడాలని ఎటువంటి నాణ్యత లోపం ఉన్న సహించేది లేదని హెచ్చరించారు. షాపులను తరచూ తనిఖీలు చేయాలని కమిటీ సభ్యులును ఆదేశించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ సకాలంలో అంగన్వాడీలకు చేరాలన్నారు. కందిపప్పు, నూనె ప్యాకెట్ ఎక్కువ ఎక్స్పైరీ డేట్ ఉన్న వాటిని సరఫరా చేయాలని కోరారు. కోడిగుడ్లపై వారం వారం ముద్రించే కలర్ కోడ్ ను తక్కువ స్థాయిలో ముద్రించాలన్నారు. తల్లి ఆరోగ్య నివేదికను ఎప్పటికప్పుడు పరిశీలించి పౌష్టికాహారం తీసుకోవడంపై అవగాహన కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా స్త్రీ శిశుసంక్షేమ శాఖ అధికారి డి.శ్రీలక్ష్మి, నోడల్ అధికారి పి.విజయలక్ష్మి, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ ఎం.డి ఇబ్రహీం, డీ ఎస్ ఓ ఎన్.సరోజ, డాక్టర్ సిహెచ్.భావన, సిడిపిఓలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.