బాలికలు హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించినప్పుడే కుటుంబం, సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

బాలికలు ఉన్నత లక్ష్యాల కోసం కలలు కనండి… సాధన చేయండి …ఉన్నత శిఖరాలు అధిరోహించండి.
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరం తిరుమల కళాశాల సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అన్నారు. చదువుకునే దశలో బాలికలు పౌష్టికాహారం తీసుకొని శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. యుక్త వయసులో వచ్చే శారీరక మానసిక మార్పుల వల్ల కలిగే ఆకర్షణలకు లోబడకూడదన్నారు. జిల్లాలో పాఠశాలలలో చదివే బాలికల ఉత్తీర్ణత శాతం బాలుర కంటే ముందు ఉందన్నారు. నేటి యువత సోషల్ మీడియాకు బానిస అవుతున్నారని, దానివల్ల చదువుపై ఏకాగ్రత తగ్గి చదువులో వెనుకబడుతున్నారన్నారు. అందువల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని హితవు పలికారు. మహిళలు విద్యావంతులై ఉద్యోగాలలో స్థిరపడి తమ కాళ్లపై తాము నిలబడే విధంగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు. నేడు మహిళలు ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రిగా, మినిస్టర్లుగా, అంతరిక్ష పరిశోధకులుగా, ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంజనీర్లు, పైలెట్లు, స్పోర్ట్స్ మరియు రక్షణ రంగంలోని వివిధ హోదాలలో మంచి ఉన్నత స్థానాలను అధిరోహించడం శుభ పరిణామం అన్నారు. అన్ని దేశాలలో కంటే భారతదేశం లోనే ప్రభుత్వాలు వివిధ రంగాలలో మహిళలకు ఎక్కువ అవకాశాలను కలుగచేస్తున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాలలో మహిళలు పురుషులకంటే ముందు ఉండాలన్నారు. బాలికలు శ్రద్ధగా చదువుకొని ఉద్యోగాలలో స్థిరపడి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రభుత్వం మహిళల విద్య కోసం కోట్లాది రూపాయల వెచ్చించి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని వాటిని సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్తును నిర్దేశించుకోవాలన్నారు. కాళ్ల మండలం మాలవాని తిప్ప జడ్పీ హైస్కూల్ తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని చిరంజీవి పి.రమాదేవి బాలికల వివక్షత, రక్షణ, చూపించాల్సిన చొరవ తదితర అంశాలపై అనర్గళంగా మాట్లాడడం అబ్బురపరిచింది. విద్యార్థిని ప్రసంగానికి ముద్దులైన జిల్లా కలెక్టర్ విద్యార్థిని దగ్గరకు తీసుకుని భుజం తట్టి ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరు రమాదేవి ప్రసంగంలోని అంశాల నుండి స్ఫూర్తి పొందాలని సూచించారు.
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా వివిధ అంశాలపై నిర్వహించిన పోటీలలో గెలుపొందిన బాలికలకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా బహుమతులను అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి డి. శ్రీలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, ఏపీసి పి.శ్యాంసుందర్, డిఎంహెచ్ఓ జి.గీతాబాయి, డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఆర్.రాజేష్, డిఐఈఓ జి.ప్రభాకర్ రావు, తిరుమల కళాశాల డైరెక్టర్లు పి.శ్రీనివాస వర్మ, ఎస్.సాయి రాజు, కళాశాల అధ్యాపకులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఐసిడిఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.