బాగా చదివిన వారికే రెసిడెన్షియల్ పాఠశాలలో అవకాశాలు వస్తాయని, కష్టపడి, అర్థం చేసుకుని చదివి, జీవితంలో క్రమశిక్షణతో మెలగాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యార్థులకు సూచించారు
పెనుగొండ గ్రామంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం ఆచంట పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. పిల్లలు ఎవరన్నా రక్తహీనతతో ఉన్నారా, డ్రింకింగ్ వాటర్ ఏం ఉపయోగిస్తున్నారు, పిల్లల చిక్కి తింటున్నారా, పిల్లలకి ఏం మెనూ ఇస్తున్నారు, హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారా, ప్రతిరోజు ఆరోగ్య పరీక్షలు జరుగుతున్నాయా, డ్రింకింగ్ వాటర్ శాంపిల్స్ సేకరిస్తున్నారా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ ను పిల్లలకి అందజేశారా, దుప్పట్లు అందరికీ ఉన్నాయా, వంట వాళ్ళు పరిశుభ్రంగా ఉంటున్నారా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వాకబు చేస్తున్నారా, వంట పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటున్నాయా, ఎంతమంది పిల్లలు తల్లి గాని లేక తండ్రి గాని, ఇద్దరూ గాని కువైట్ లో ఉంటున్నారు. వారిని ఇంటికి పంపించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తదితర విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ బాగా చదివే వారికే రెసిడెన్షియల్ పాఠశాలలో అవకాశాలు వస్తాయన్నారు. కష్టపడి చదువుకోవాలని, అర్థం చేసుకుని చదివితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అలాగే జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు, అప్పుడే ఒక గొప్ప స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయని తెలిపారు. దేశంలో అత్యున్నత పదవులు నిర్వహించే వ్యక్తుల కన్నా మీ తల్లి ఎంతో గొప్ప వారని, వారు కుటుంబానికి వెన్ను ముఖ అని, కుటుంబాన్ని అంతటినీ కంటికి రెప్పలాగా, ఒక క్రమశిక్షణతో నడపడానికి ఎంతో ఓర్పు, సహనం అవసరం అన్నారు. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్నారు. మంచిగా ఆడుకోవాలని, అనవసర విషయాల జోలికి వెళ్లకూడదని హితువు పలికారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి విద్యార్థికి పూర్తిగా చేరాలని స్పష్టం చేశారు. 10వ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా సంభాషిస్తూ చదువే మీ భవిష్యత్తు అని, అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. అనవసర అలవాట్లకు దూరంగా ఉండి లక్ష్యంపై దృష్టి పెట్టాలని ప్రేరణనిచ్చారు. పెనుగొండ గురుకులంలో కలెక్టర్ పర్యటన విద్యార్థులకు ప్రేరణాత్మకంగా, పాఠశాల నిర్వహణకు మార్గదర్శకంగా నిలిచింది.
చివరిగా ఓజోన్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఒలింపియాడ్ – జాతీయ స్థాయి డ్రాయింగ్ & పోస్టర్ మేకింగ్ పోటీలో ప్రతిభ కనబరిచిన విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ దాసిరాజు, తహసిల్దార్ జి.అనిత కుమారి, స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్.సుభాషిణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.