Close

బలహీనంగా ఉన్న కాలువలు, చెరువుల వద్ద సిబ్బంది, సామగ్రి తో పొజిషన్ లో ఉండాలి

Publish Date : 28/10/2025

లోతట్టు ప్రాంత ప్రజలను అవసరమైతే ముందుగా పునరావాస కేంద్రాలకు తరలించాలి

పునరావాస కేంద్రాల్లో రుచికరమైన భోజనం, అల్పాహారం అందించడంతోపాటు, స్వచ్ఛమైన తాగునీటినందించాలి

పునరావస కేంద్రాల వద్ద మౌలిక వసతుల ఏర్పాట్లు ఎక్కడా రాజీ పడని విధంగా ఏర్పాటు చేయాలి.

జనరేటర్ లను సిద్ధంగా ఉంచుకోవాలి

బలమైన ఈదురుగాలులకు విద్యుస్తంభాలు, కరెంట్ లైన్లు తెగిపడే అవకాశం ఉన్నందున, విద్యుత్ శాఖ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలి

ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగడానికి వీల్లేదు

జిల్లాలో లోతట్టు ప్రాంత ప్రజలను ముందుగా గుర్తించి తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

మంగళవారం మొగల్తూరు మండలంలోని బెల్లంకొండ వారి మెరక రైతు భరోసా కేంద్రం, పాతపాడు జెడ్ పి పి స్కూల్, భీమవరం మండలం నాగిడిపాలెం పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కూడా పాల్గొన్నారు. పునరావస కేంద్రాలలోని ఏర్పాట్లను కలెక్టర్ అడుగడుగునా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. తుఫాను షెల్టర లో ఆశ్రయం పొందిన ప్రజలతో కొద్దిసేపు మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఏర్పాట్లు బాగా చేశారని ఏ ఇబ్బందులు లేవని వారు బదులిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందిన వారికి అందించే భోజనం, అల్పాహారం సుచిగా, రుచిగా వేడివేడిగా అందించాలని, ఇందులో రాజీ పడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని నియమించాలని, పునరావాస కేంద్రాల ప్రాంగణమంతా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వృద్ధులను, పాత ఇళ్లు, పాడు పడిన ఇళ్లల్లో ఉన్నవారిని, పాకల్లో ఉన్న వారిని తప్పకుండా పునరావాస శిబిరాలకు చేర్చాలని తెలిపారు. అదే విధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారి బంధువుల ఇళ్లకు వెళతామని చెప్పేవారిని వారి బంధువుల ఇళ్ల వద్దకే సురక్షితంగా చేర్చాలని ఆదేశించారు. గర్భిణీలను గుర్తించి వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, నెలలు నిండిన వారిని సమీప పి హెచ్ సి లేదా సి హెచ్ సి ల్లో చేర్పించాలని, వారికి అవసరమైన మందులు, ఆహారాన్ని అందించాలని తెలిపారు. తప్పుడు వార్తలను, వదంతులను వ్యాపించకుండా, ప్రజల్లో లేని పోనీ అనుమానాలు రేకెత్తకుండా రెవిన్యూ అధికారులు చూడాలని తెలిపారు. చెరువుల్లో చేరే ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో పై దృష్టి సారించాలని, గండ్లు పడితే ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇసుక బస్తాలు, వాహనాలు, సిబ్బంది బలహీనంగా ఉన్న చెరువుల వద్ద అవసరమగు సామగ్రి తో పొజిషన్ లో ఉండాలని, ఇరిగేషన్ అధికారులతో పాటు రెవిన్యూ అధికారులు కూడా ఉండాలని తెలిపారు. విద్యుత్ అధికారులు తన సామగ్రి తో సిద్ధంగా ఉండాలని, ఆర్ అండ్ బి అధికారులు ఎక్కడెక్కడ ముప్పు ఉందొ గుర్తించి ఆ ప్రాంతాల్లో వారి సామాగ్రితో, సిబ్బంది తో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రమాదం సంభవిస్తే తప్పించుకునే అవకాశం ఉండేలా పశువులను కట్టకుండా ఉంచాలని తెలిపారు. తాగు నీరు కలుషితం కాకుండా క్లోరిన్ కలిపిన నీటిని సరఫరా చేయాలని, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్.డబ్ల్యు.ఎస్ ఎస్.ఈ కి డి.పి.ఓ లకు సూచించారు. అత్యవసర మందులు, అత్యవసర వాహనాల తో సిద్ధంగా ఉండాలని డి ఎం హెచ్ ఓ కు ఆదేశించారు.
అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.

జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని, అధికారులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

ఈ సందర్భంలో నరసాపురం ఆర్డీవో దాసిరాజు, మొగల్తూర్ తహసిల్దార్ రాజ్ కిషోర్, యలమంచిలి తహసిల్దార్ జి.పవన్, విద్యుత్ శాఖ ఈఈ మధుబాబు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, తదితరులు ఉన్నారు.