బధిరులు బాగా చదువుకుని జీవితంలో స్థిరపడేందుకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు
బుధవారం భీమవరం డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలోని శ్రీ రామకృష్ణ సభ భవన్ నందు శ్రీ వెంకటేశ్వర బధిర పాఠశాల 35వ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర బధిర పాఠశాలను 1985 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ప్రారంభించడం జరిగిందన్నారు. 150 మంది వరకు విద్యార్థులు చదువుకునేవారని, నేడు 75 మంది మాత్రమే చదువుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో బధిర వైకల్యం కలిగిన వారిని గుర్తించి ఈ పాఠశాలలో చదువుకునేలా ప్రోత్సహించాలన్నారు. దివ్యాంగులకు సహజ సిద్ధంగానే తెలివితేటలు అధికంగా ఉంటాయన్నారు. చదువు చాలా అవసరమని, చదువుకోకపోవడమే ఒక నిజమైన వైకల్యం అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నాకు ఏదో లోపం ఉంది అనుకోకుండా ఆత్మస్థైర్యంతో బాగా ఉన్నత చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలతో జీవితంలో స్థిరపడాలన్నారు.
తొలుత బధిర విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనకు జిల్లా కలెక్టర్ ముగ్ధులై విద్యార్థులను అభినందించారు. చాలా చక్కగా అభినయంతో కూడిన నృత్య ప్రదర్శన చేశారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బధిర పాఠశాల మాజీ సభ్యులు పేరిచర్ల లక్ష్మణవర్మ, డిఎన్ఆర్ కళాశాల అధ్యక్షులు జి.వి నరసింహారాజు, కరస్పాండెంట్ జి.సత్యనారాయణ రాజు, గన్నాబత్తుల తులసమ్మ పెదతాత ట్రస్ట్ అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్, బధిరుల సంఘం జిల్లా చైర్మన్ చెరుకువాడ రంగసాయి, శ్రీ వెంకటేశ్వర బధిర పాఠశాల ప్రిన్సిపాల్ ఎ.తిరుపతిరావు, రాష్ట్ర చెవిటి సంఘం అధ్యక్షుడు ఏ.లక్ష్మీనారాయణ, ట్రాన్స్ లేటర్ కే రాజు కె.రాజు, ఆహ్వాన కమిటీ వైస్ చైర్మన్ జి.శ్రీనివాసరాజు, ప్రెసిడెంట్ ఎస్.శ్రీనివాస్ వర్మ, అసోసియేట్ ప్రెసిడెంట్ జి. గంగాధరన్, జనరల్ సెక్రటరీ సిహెచ్.తాతారావు, పూర్వపు ప్రిన్సిపాల్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, పూర్వపు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.