బడుగు బలహీన వర్గాల సంక్షేమం, కార్మికుల అభ్యున్నతి కొరకు అహర్నిశలు కృషి చేసిన మహనీయులు బాబూ జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు .

బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతోత్సవాలను పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు. జ్యోతిని వెలిగించి వేడుకలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక సేవ చేస్తూనే కుల నిర్మూలన ఉద్యమాలు నడిపిన గొప్ప నాయకులుగా బాబూ జగ్జీవన్ రామ్ చరిత్రలో నిలిచిపోయారని కలెక్టర్ తెలిపారు. తన జీవితకాలం సామాజిక సేవలోనే నిలిచారన్నారు. రాజకీయ రంగంలోనూ ప్రవేశించిన ఆయన వివిధ పదవుల్లో సమర్థంగా పని చేశారన్నారు. ప్రధానంగా కుల నిర్మూలన కోసం ఉద్యమాలు నడిపారన్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రవేశపెట్టి శాశ్వతంగా ఆహార సమస్యకు పరిష్కారం చూపారన్నారు. కార్మికుల కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు చదువుకోవాలన్నారు. ప్రజలు తమ పిల్లలను ఉన్నత విద్యను చదివించాలని, అప్పుడే అటువంటి మహాత్ముల ఆశయానికి సార్థకత చేకూరుతుందన్నారు. 6,7,8 తరగతులలో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయని, చదువు లేకుండా ఏ కార్యక్రమాన్ని ముందుకు నడపలేరని, అన్నింటికి చదివే ప్రధానమని ప్రతి ఒక్కరోజు చదువుకునేలా అందరూ బాధ్యత వహించాలన్నారు. కేంద్ర మంత్రి గా పని చేసిన సమయం లో అట్టడుగు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడని, వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం భావితరాలకు మార్గదర్శకులుగా ఉండాలన్నారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ చాలా గొప్ప వ్యక్తిని, భారతదేశ చరిత్రలో లేనివిధంగా సుమారు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రులు గాను , ఉపప్రధాని మంత్రిగా పనిచేయడం ఎంతో గర్వకారణం అన్నారు. వివిధ శాఖలను అలంకరించి ఆ శాఖలలో వినూత్న మార్పులు తీసుకొచ్చి తనదైన ముద్రను వేశారన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరాయంగా పోరాడిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు సమానత్వంతో ఉండాలనే లక్ష్యంతో బడుగు బలహీన వర్గాలతో పాటు స్త్రీలకు కూడా విద్య విషయంలో అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ గారిని స్ఫూర్తి గా తీసుకొని ప్రతి కుటుంబంలోని పిల్లలను బాగాచదివించుకోవలన్నారు. స్టేట్స్ మెన్ దినపత్రిక చదవడానికి ప్రతిరోజు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి ఆ దినపత్రికను చదివి వచ్చేవారన్నారు. ప్రసిద్ధిగాంచిన నవలను చదవడానికి బెంగాలీని నేర్చుకున్నారంటేనే వారు ఎంత గొప్ప పఠనాశక్తి కలిగిన వారో అర్థం అవుతుందన్నారు.
ఈ సమావేశములో డివిఎంసి సభ్యులు చకటమిల్లి మంగరాజు, పొన్నమండ బాలకృష్ణ, తెన్నేటి జగ్జీవన్, బంగారు కరుణ రాజు, తాడికొండ జయకృష్ణ, సత్య సుధామ సభ్యులు, న్యాయవాది విజయ రాజు మరియు కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు మాట్లాడుతూ ఏప్రిల్ నెలను సామాజిక మాసంగా భావిస్తామని ఈ నెలలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషిచేసిన సంఘసంస్కర్తలు, మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తులు జన్మించారన్నారు. బాబు జగజీవన్ రామ్ చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే భీమవరంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని విన్నవించారు.
ఈ కార్యక్రంలో జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిక అధికారి బి.వి.ఎస్.బి రామాంజనేయరాజు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు, తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, ఏఎస్ డబ్ల్యూ ఓ సిహెచ్.భానుమతి, సూపరింటెండెంట్ ఎస్.ఎన్.వి.సత్యనారాయణ, వసతి గృహ సంక్షేమ అధికారులు, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.