బడి పిల్లలకు నేటి నుండి సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా నేడు విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం వడ్డించిన రాష్ట్ర పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకములో భాగంగా సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని గురువారం భీమవరం పట్టణంలోనీ పి.ఎస్.ఎం పురపాలక బాలికొన్నత పాఠశాలలో రాష్ట్ర పిఏసి చైర్మన్ మరియు భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బోర్ర గోపి మూర్తితో కలిసి ప్రారంభించారు. సన్న బియ్యంతో తయారుచేసిన వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, బంగాళాదుంప కూర్మా, బాయిల్డ్ ఎగ్ ను విద్యార్థినులకు స్వయంగా వడ్డించడంతోపాటు, విద్యార్థినులతో కలిసి క్యూలో నిలబడి భోజనాన్ని పెట్టించుకోని, వారితో కలిసి సహపంక్తి భోజనం చేసి విద్యార్థినిలలో స్ఫూర్తిని నింపారు. భోజనం సమయంలో విద్యార్థినులతో పాలు విషయాలపై ముచ్చటించారు. గతంలో మధ్యాహ్నం భోజనం ఎలా ఉండేది, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, మెనూ ప్రకారం అందిస్తున్నారా, రుచికరంగా వండుతున్నారా అని పలు ప్రశ్నలు వేసి సమాధానం తెలుసుకున్నారు. రుచికరమైన మెనూతోపాటు ఈరోజు నుండి సన్న బియ్యం భోజనం తయారుచేసి అందించటం మీకు ఎలా ఉందని ప్రశ్నించారు. భోజనం చాలా బాగుందని, ఇంతకు ముందు అప్పుడప్పుడు ఇంటి దగ్గర నుండి భోజనం తెచ్చుకోవడం జరిగేదని, ఇకనుండి అందరం పాఠశాలలోనే భోజనం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ పాఠశాలలో విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు పౌష్టికాహార లోపం లేకుండా ఉండేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో సన్న బియ్యంతో తయారుచేసిన రుచికరమైన భోజనమును రాష్ట్రవ్యాప్తంగా డొక్క సీతమ్మ భోజనం పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నేటి నుండి అందించడం జరుగుచున్నదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాభ్యాసంతో పాటు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించడమే లక్ష్యమని అన్నారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పౌష్టికాహార మెనూను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను ఈ రోజు జూన్ 12న తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. ముఖ్యముగా మిడ్ డే మీల్స్ లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నేటి నుండి సన్నబియ్యంతో తయారు చేసిన అన్నమును పిల్లలకు వడ్డించడం జరుగుతుందని అన్నారు. ఇది నూతన కార్యక్రమమని, సంతోషించదగిన విషయం అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల ప్రకారం ప్రతి స్కూల్, హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో తయారుచేసిన భోజనమును పెట్టడం వలన ఇష్టముతో తినడం జరుగుతుందని, తద్వారా స్కూల్ డ్రాప్ ఔట్ట్స్ కూడా తగ్గుతాయన్నారు. జిల్లాలోని 1,425 పాఠశాలల్లో, 75 వసతి గృహాల్లోని 82 వేల మంది విద్యార్థులకు ఫైన్ క్వాలిటీ రైస్ తో మెనూ ప్రకారం భోజనమును అందజేయటం జరుగుతుందని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని ఘనంగా ప్రారంభించటం జరిగిందన్నారు. అలాగే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా స్కూల్ బ్యాగ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎటువంటి ఫిర్యాదులు అందిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగులను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ బోర్ర గోపి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసిల్దార్ రావి రాంబాబు, ప్రధానోపాధ్యాయులు సాయి ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మెరగాని నారాయణమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
