బంగారు కుటుంబాలకు పి4 అమలలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి
పి4 బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు హృదయం ఉన్న దాతలు ముందుకు రావాలి
శుక్రవారం కాళ్ల మండలం బొండాడ గ్రామంలో పి4 గ్రామసభను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఇప్పటికే బొండాడ గ్రామంలో గుర్తించిన 128 బంగారు కుటుంబాలకు సంబంధించిన డేటాను గ్రామ సెక్రెటరీ గ్రామసభలో పేరుపేరునా చదివి వినిపించగా, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వారి యెక్క స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నాను. ఈ సందర్భంలో అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. బంగారు కుటుంబాలు జాబితాలో అనర్హులకు చోటు కల్పించకపోవడం ఎంత ముఖ్యమో, అర్హులను జాబితాలో చేర్చడం అంతే ముఖ్యం అన్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదటనే జాబితాను అప్డేట్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజలే సహాయం చేయడం అనే లక్ష్యంతో ప్రభుత్వం పి4 కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. బంగారు కుటుంబాలకు మార్గ నిర్దేశం చేసేందుకు సంపన్నులుగా ఉండడం ఒక విషయం అయితే, అన్నింటికంటే గొప్ప హృదయం కూడా కలిగి ఉండాలన్నారు. ప్రతి బంగారు కుటుంబానికి ఒకే విధమైన సహాయం అవసరం ఉండదని కొందరికి ఆర్థికంగా అయితే, మరికొందరికి పిల్లల చదువులు తదితర విషయాలకు మార్గదర్శకంగా ఉండాల్సి ఉంటుందన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, ఏ ఆధారం లేని పెద్దలు, మధ్య వయసులో ఉండి ఆర్థికంగా వెసులుబాటు లేని కుటుంబాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యసాధనలో భాగంగా పి 4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్) కార్యక్రమం అమలు జరుగుతుందన్నారు. జిల్లాలో పేదరిక నిర్మూలనలో పి4 కార్యక్రమం కీలకంగా వ్యవహరించనున్నదని, పూర్తిస్థాయిలో అమలు అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమానికి సంబంధించిన సమస్యలు, సలహాలు సూచనలు తెలియజేయాలని కోరారు. అర్హులైన పేద కుటుంబాలను గుర్తించడంతో పాటు వారిని దత్తత తీసుకునేందుకు మార్గదర్శిలను గుర్తించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో సిపిఓ కె.శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయాల అధికారి వై. దోశి రెడ్డి, డ్వామా పిడి మరియు పి4 స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ కే సిహెచ్ అప్పారావు, ఎంపీడీవో జి. స్వాతి, గ్రామ సర్పంచ్ మన్నే వరలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ బాలకృష్ణ, వైస్ ఎంపీపీ మన్నె శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగరాజు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.