ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించడంతోపాటు, సమస్యను ఓర్పుతో వినాలి. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి
సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ మొగిలి వెంకటేశ్వర్లు,
గ్రామ వార్డు సచివాలయం అధికారి వై దోసిరెడ్డి రెడ్డి, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివన్నారాయణ రెడ్డితో కలసి జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు నుండి అర్జీలను స్వీకరించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కు సంబంధించి అర్జీలు పరిష్కారంకు ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ప్రతీ అర్జీకి చక్కని పరిష్కారం చూపాలని అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్జీని ఆడిటింగు చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్ణీత సమయం లోపుగానే పరిష్కరించా లన్నారు. అర్జీల పరిష్కారంలో క్షేత్ర స్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని, అప్పుడే ప్రజలకు మనపై నమ్మకం కలుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతివారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీ-ఓపెన్ అయినట్లైతే వాటికి గల కారణాలను తప్పక వివరించాలన్నారు. వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు ఆన్లైన్ తో పాటు తప్పనిసరిగా డైరీలో కూడా నమోదు చేసుకోవాలని, త్వరితగతిన పరిష్కారంకు అవకాశం కలుగుతుం దన్నారు. ప్రతి అర్జీ పరిష్కారంలో నాణ్యత కనబరచాలని, అర్జీలు రీఓపెన్ లేకుండా అధికారులు అత్యంత శ్రద్ద వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.
మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 274 అర్జీలు వచ్చాయి, వాటిలో కొన్ని సమస్యలు ఇలా ఉన్నాయి
@ భీమవరం నరసయ్య అగ్ర హారం, 5 వార్డు, పార్క్ వీధి వాస్తవ్యులు అర్జీని సమర్పిస్తూ,ఈ వీధిలో సరైన డ్రైనేజీ వ్యవస్థ, రోడ్డు లేకపోవడం వల్ల వర్షపు నీరు రోడ్డుపై నిలిచి పోతోందని దానివల్ల దోమలు బెడద ఎక్కువగా ఉంటుందన్నారు. పలు పర్యాయాలు మున్సిపల్ కార్యాలయానికి ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని,రోడ్డు నిర్మించి డ్రైనేజీ సదుపాయం కల్పించాలని కోరారు.
@అత్తిలి మండలం, ఈడూరు గ్రామానికి చెందిన ఘంటసాయిబాబు అర్జీ సమర్పిస్తూ తనకు 60 సంవత్సరాలని,షుగర్ వ్యాధి వ్యాధి వల్ల డాక్టర్లు తన ఎడమకాలి వేళ్ళు తొలగించారని, తాను తోపుడు బండిలో పండ్ల వ్యాపారం చేసుకుంటూనన్నారు. అనారోగ్యముతో నడవలేకపోతున్నానని దయచేసి తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కోరారు.
@గణపవరం మండలం చిలకంపాడు వాస్తవ్యులు బొడ్డుపల్లి దుర్గాభవాని అర్జీని సమర్పిస్తూ, నా భర్త రోడ్డు ప్రమాదంలో మరణించారని, తనకు ఒక కుమారుడు ఉన్నాడని, తనని, తన కుమారుడను భర్త కుటుంబ సభ్యులు ఇంటి నుంచి గెంటవేశారని, పెద్దల మధ్య సమస్య పెట్టిన పరిష్కారం కాలేదన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదన్నారు. నాకు, నా బిడ్డకు నా అత్త ఇంటి వద్ద నీడ కల్పించాలని కోరారు.
@ఉండి మండలం ఉనుదుర్రు గ్రామస్తులు, న్యాయవాది గొర్రు ముచ్చు సుందర కుమార్ అర్జీ సమర్పిస్తూ, గ్రామం ఎస్సీ పేటలో పంచాయతీ చెరువు ఉందని, దీనికి నీరు వెళ్ళు ఇరిగేషన్ కాలువ ప్రక్కన ఆర్ అండ్ రోడ్డు ఆక్రమించి మధ్యలో ఇల్లు నిర్మించుకున్నారని, ఇళ్ల నుండి వచ్చే మురుగు నీరు పైపులు చెరువుకు వెళ్లే కాలువలో పెట్టారన్నారు. దీనివల్ల చెరువు కలుషితమై పశువులు కూడా త్రాగడానికి పనికిరాకుండా పోయిందని, సుమారు 200 కుటుంబాలు ఈ చెరువు పై ద్వారా ఆధారపడి ఉన్నాయని, కావున కాలువ సర్వే చేయించి ఆక్రమణలు తొలగించి, వ్యర్ధాల పైపులను కాలువలో పెట్టకుండా నిషేధించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
@మొగల్తూరు మండలం కొత్తపాలెం గ్రామస్తులు చెన్ను వరలక్ష్మి అర్జీ సమర్పిస్తూ, తనకు శేరేపాలెం గ్రామంలో 42 సెంట్లు భూమి ఉందని, గ్రామ సభలో ఆన్లైన్ చేయమని ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేన్నారు. బ్యాంకు ఋణం కొరకు సంప్రదించగా ముందుగా భూమి ఆన్లైన్ చేయించుకోవాలని సూచించారన్నారు. కావున తన భూమిని ఆన్లైన్ చేయించి, పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించాలని కోరారు.
ఈ సమావేశంలో డిఆర్డిఏ, పిడి ఎం. ఎస్. ఎస్. వేణుగోపాల్ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జెడ్. వెంకటేశ్వరరావు, డి ఎం అండ్ హెచ్ ఓ జి.గీత భాయి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.