Close

ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి మెరుగైన ఫలితాలను సాధించిన విద్యార్థుల అభినందనీయులని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Publish Date : 25/04/2025

గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలయందు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు పొందిన 10 మంది విద్యార్థిని, విద్యార్థులను మెమొంటోలతో సత్కరించారు. అదేవిధముగా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించియున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి భవిష్యత్ లక్ష్యాలకు సంబందించి మార్గనిర్ధేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో చదివితేనే మెరుగైన ఫలితాలను సాధిస్తాం అనేది నిజం కాదని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నిరూపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రైవేటు విద్య అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదని, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులతో పాటు సుశిక్షితులైన ఉపాధ్యాయులు కూడా ఉంటారనే విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించాలన్నారు. భవిష్యత్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి విద్య ద్వారా మాత్రమే సాధ్యమని, చక్కటి ప్రణాళికతో, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి, మంచి స్థాయికి చేరుకోవాలని, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గర్వంగా నిలవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ప్రతిభకు లోటు ఉండదని నిరూపించారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ విద్యాసంవత్సరంలో 500కు పైగా మార్కులు సాధించిన 1,485 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. విద్యార్థులను వారి భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంలో భీమవరం ఆర్డీవో కే ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు.