ప్రభుత్వ పాఠశాలలో చేరికలపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు, ప్రభుత్వ పాఠశాలల విద్యాబోధనపై ఇంటింటి ప్రచారం ద్వారా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ పదో తరగతి పరీక్ష ఫలితాలు, ప్రభుత్వ పాఠశాలలో చేరికలు, అల్పదాయ వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయింపు, బడి బయట పిల్లలు చేరికలు, ఆపార్ ఐడి నమోదు అంశాలపై విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎందుకు మేటిగా నిలుస్తుందో ప్రతి ఒక్కరికి తెలియచెప్పాలన్నారు. కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరగాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానంపై ప్రతి ఒక్కరికి తెలియ చెప్పడమే ప్రధానమన్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు గొప్ప మేలు తలపెడుతున్నామన్న భావనతో ప్రైవేట్ పాఠశాలల్లో చేర్చి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాళ్లు ఎంత మేలు చేస్తున్నారో 10వ తరగతితోనే తెలిసిపోతుందన్నారు. సుశిక్షితులైన ఉపాధ్యాయులతో అన్ని మౌలిక వసతులతో ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం, దుస్తులు, బ్యాగ్ తదితర వాటితో పాటు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందేనని, దీనికి మీ వంతుగా మరింత ప్రచారం, అవగాహన కలగజేస్తే సరిపోతుందని అన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచే లక్ష్యంగా బడి బయట పిల్లలు ఉండకూడదని మన ముఖ్యమంత్రి దాదాపు 20 సంవత్సరాల క్రితమే సూచించడం జరిగిందని, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి కూడా పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారని, వారు మెరుగైన విద్యకు అందిస్తున్న చేయూతతో పాటు మీరు మరింత శ్రద్ధతో బాగా పనిచేసి మంచి ఫలితాలను సాధించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రచారం కొరవరడం జరిగిందన్నారు. గ్రామ, మండల స్థాయిలో ప్రణాళికలను సిద్ధం చేసుకుని మండల ప్రత్యేక అధికారి, ఎంఈఓ, హెచ్ఎం, ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించాలని సూచించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా 82.15 శాతం నమోదు చేసుకుని రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచిందన్నారు. రానున్న విద్యా సంవత్సరం ఫలితాల్లో ఈ స్థానం మరింత తగ్గాలన్నారు. జిల్లాలో మొత్తం 21,539 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరుకాగా వారిలో మగ పిల్లలు 10,924 మందికి గాను 8,612 మంది ఉత్తీర్ణత చెంది 78.84 శాతం, ఆడపిల్లలు 10,615 మందికి గాను 9,083 మంది ఉత్తీర్ణత చెంది 85.57 శాతాన్ని నమోదు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు మే 19 నుండి మే 28 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వీరికి ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని డీఈఓ ను ఆదేశించారు. అల్పదాయ వర్గాల పిల్లలకు ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25% కోటా సీట్లు భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందని, ఏప్రిల్ 28 నుండి మే 15 వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 25 శాతం సీట్లు భర్తీ సమయంలో సింగిల్ పేరెంట్ చిల్డ్రన్, తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లా ఇంకా 32,723 మంది విద్యార్థులకు ఆపార్ ఐడి జనరేట్ చేయాల్సిందని, దీనిపై ఎంఈఓలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ఆధార్ డేటా నమోదు చేసి ఉంటారని, వాళ్ల వద్ద సమాచారం ఉండకపోవచ్చునని, మళ్లీ ఆ పిల్లవాని డేటా నమోదుకు సాధ్యపడదన్నారు. ఇటువంటి కేసులకు సంబంధించిన ఆధార్ లేని పిల్లల వివరాలను సేకరించి మండలాల వారిగా అందజేస్తే హైదరాబాదులోని ఆధార్ రీజనల్ సెంటర్ కు పంపి సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. పిల్లలు బడి బయట ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదని, ముఖ్యంగా 6, 7, 8 తరగతులలో డ్రాప్స్ ఔట్స్ ఎక్కువగా ఉంటున్నాయని, వాటిని నిరోధించడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలన్నారు.
సమావేశం అనంతరం “మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు” సమాచారంతో కూడిన కరపత్రాన్ని, గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో డిఇఓ ఇ.నారాయణ, సమగ్ర శిక్ష ఏపీసి పి. శ్యాంసుందర్, జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి వై.దోసి రెడ్డి, డిప్యూటీ ఈవోలు, డీఈఓ కార్యాలయం ఏడి ఎన్.సత్యనారాయణ, ఎంఈఓలు, తదితరులు పాల్గొన్నారు.