Close

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని గరిష్ట ప్రయోజనం పొందేల అవగాహన కల్పించడమే ధాన్యం కొనుగోలు అవగాహన సదస్సులు ముఖ్య ఉద్దేశం –జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 26/09/2025

అక్టోబర్ 10వ తారీకు లోపు తాడేపల్లిగూడెం మండలంలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభం.

శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నందు ఖరీఫ్ 2025-26 సీజన్ ధాన్యం కొనుగోలు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్ముకొని మద్దతు ధర పొందాలన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో అక్టోబరు 10వ తేదీ లోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. రైతులు దళారులు, మధ్యవర్తులు చేతిలో నష్టపోకుండా, ఎటువంటి మోసాలకు తావులేకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా మాత్రమే ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని గరిష్ట ప్రయోజనాలు పొందేలా అవగాహన కల్పించడమే ధాన్యం కొనుగోలు అవగాహన సదస్సులు ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ సందర్భంగా రైతులకు ధాన్యం తేమశాతంలో ఎదురవుతున్న సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, తేమశాతం బరువు, నాణ్యత వంటి అంశంపై రైతు సేవ కేంద్రాలు వద్ద నిర్ధారించిన తేమ శాతం మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుందని దీనిపై ఎటువంటి సమస్యలు ఉన్న మండల స్థాయి అధికారులు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు నిమిత్తం సరఫరా చేసే గోనె సంచులు నాణ్యతను ముందుగా చూసుకొని రైతులు తీసుకు వెళ్లాలన్నారు. ఎఫ్ ఎ క్యూ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని సిద్ధపరిచి ప్రభుత్వం ద్వారా మద్దతు ధరకు అమ్ముకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. అనంతరం ధాన్యం కొనుగోలు సమాచారాన్ని తెలియజేసే కరపత్రమును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, తహసిల్దార్ ఎం.సునీల్ కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి నారాయణరావు, గ్రామ సర్పంచ్ సూర్య కుమారి, కృషి అమృత భారత్ చైర్మన్ నరేష్, రెవెన్యూ, వ్యవసాయ, పంచాయితీ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.