• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు సేవా తత్పరతతో కూడిన నమ్మకమైన వైద్యాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 14/08/2025

గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తణుకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. హాస్పటల్ ప్రాంగణమంతా కలియతిరిగి అనువణువునా పరిశీలించారు. గత రెండు సమావేశాలలో హాస్పటల్ అభివృద్ధిపై సూచించిన పనులు ఎంతవరకు పూర్తి అయ్యాయి అని తెలుసుకొని డ్రైనేజీ పనులను, టాయిలెట్ల నిర్మాణాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలోని బయో కెమిస్ట్ ల్యాబ్, ప్రసూతి వార్డు, అత్యవసర చికిత్స విభాగం, స్త్రీల శస్త్రచికిత్స వార్డు, హై డిఫెన్స్ వార్డు, పెడియాట్రిక్స్ వార్డు, ఆప్తలమిన్ వార్డు, పురుషుల శస్త్రచికిత్స వార్డు, రక్తదాన శిబిరం, వయోవృద్ధుల చికిత్స వార్డు, తదితర విభాగాలు అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి రోగులతో, డాక్టర్లతో మాట్లాడి పలు విషయాలపై ఆసుపత్రి సూపర్నెంటుకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఆసుపత్రి సందర్శన సమయంలో రోగులకు మధ్యాహ్న భోజనాన్ని అందించడం చూసి స్వయంగా పరిశీలించారు. ఏ విధమైన ఆహారాన్ని అందిస్తున్నారు, రోజు ఇలానే అందిస్తారా అని ప్రశ్నించారు. భోజనంలో అన్నం, పప్పు, కూర, సాంబారు, పెరుగు, గ్రుడ్డు, అరటి పండు రోజు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పురుషుల అత్యవసర విభాగాన్ని పరిశీలిస్తున్న సందర్భంలో చాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన తాడేపల్లి నివాసికి అందిస్తున్న వైద్య చికిత్సపై ఆరా తీసి కొంత సమయం దగ్గర ఉండి పరిశీలించారు. ఈ సందర్భంలో వారి భార్యతో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. హాస్పటల్ సందర్శన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హాస్పటల్ పరిసరాలను మరింత పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, గ్రీనరీని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. హాస్పటల్ లోని ప్రసూతి వార్డులు, పిల్లల వార్డులు, వార్డుల వెలుపల అందమైన చిత్రాలను వేయిస్తే ఆహ్లాదకరంగా ఉంటుందని సూచించారు. రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఒక భరోసా కలిగేలా వైద్యాన్ని అందించేందుకు ప్రతి ఒక్క వైద్యులు కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వైద్యం అందిస్తే పేదవారిని మీరందరూ పరోక్షంగా ఆర్థికంగా ఆదుకున్నట్లేనని తెలిపారు. తణుకు ఆసుపత్రిలో గత కొద్ది నెలలుగా మౌలిక వసతులు అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నామని, ఇందుకు అనుగుణంగా మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు.

ఈ సందర్భంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సాయి కిరణ్ , ఆర్ఎంఓ డాక్టర్ ఏవిఆర్ఎస్ తాతారావు, రేడియోగ్రాఫర్ వైవిఎస్వి రాయుడు, తణుకు తహసీల్దార్ డివిఎస్ఎస్ అశోక్ వర్మ, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, హాస్పటల్ వివిధ విభాగాల వైద్యులు, తదితరులు ఉన్నారు.