ప్రభుత్వ ఆసుపత్రులలో అందించే వైద్య సేవలపై సంతృప్తిస్థాయి పెరిగే విధంగా వైద్యాధికారులు, డాక్టర్లు మెరుగైన సేవలందించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీల ప్రసవాలు తగ్గడంపై వైద్యాధికారులు, డాక్టర్లపై కలెక్టర్ ఆగ్రహం
ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సిబ్బంది రోగుల నుండి సొమ్ము డిమాండ్ చేస్తే కఠిన చర్యలు.
ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.
జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాలలో నూరు శాతం లక్ష్యసాధనకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలి.
కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల మెడికల్ అధికారులు, ఏరియా ఆసుపత్రుల వైద్యాధికారులు, సూపరింటెండెంట్స్, పిహెచ్సి డాక్టర్లు, ప్రోగ్రాం ఆఫీసర్లతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అందుతున్న సేవలు, వివిధ ఆరోగ్య అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని విభాగాలలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీల ప్రసవాలు తగ్గడం పట్ల వైద్యాధికారులు, డాక్టర్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీల ప్రసవాలు పెరిగే విధంగా గైనకాలజిస్ట్లు, వైద్య సిబ్బంది గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించాలన్నారు. అత్యవసర పరిస్థితులలో ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఎటువంటి డేటా, వివరాల కోసం ఆలస్యం చేయకుండా తక్షణమే వైద్యులు వైద్య సహాయం అందించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. సాధ్యమైనంత వరకు ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు జరిగే విధంగా చూడాలని, సిజేరియన్ల శాతం తగ్గే విధంగా డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు అందించే సేవలపై రోగులు సంతృప్తి స్థాయి పెరిగే విధంగా వైద్యాధికారులు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల ఆప్యాయంగా వ్యవహరించాలని, పరిశుభ్రమైన వాతావరణ ఉండాలని, వార్డులలో బెడ్ షీట్స్ ఎప్పటికప్పుడు మార్చే విధంగా నిరంతరం పర్యవేక్షించాలని, ఆస్పత్రులలో ప్రసవాలు పెరిగే విధంగా చూడాలని ఆసుపత్రి సూపరిండెంట్లను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అందుతున్న మెరుగైన సేవలపై గత మూడు నెలల నుండి మన జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండటం పట్ల కలెక్టర్ వైద్య సిబ్బందిని అభినందించారు.
డాక్టర్లు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి:
రోగుల వైద్య సేవలో వైద్యులు నిరంతరం కష్టపడి పనిచేస్తారని, కొంతమంది వైద్యులు పని ఒత్తిడి వల్ల తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. ముఖ్యంగా వైద్యులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని ఎప్పటికప్పుడు వారు కూడా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ డాక్టర్లకు హితవు పలికారు.
ఇటీవల ఆర్ ఎం ఓ డాక్టర్ తాతారావు ఆకస్మికంగా మరణించడం పట్ల జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తన ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఎం అండ్ హెచ్ ఓ జి.గీతాబాయి, డిసిహెచ్ఎస్ డా.పీ.సూర్యనారాయణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ దేవసుధ, ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ డిస్టిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ కీర్తి, వివిధ విభాగాల వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.