Close

ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా యోగాంద్ర కార్య‌క్ర‌మాన్ని జిల్లాలో విజ‌యవంతం చేసేందుకు భారీ ప్ర‌ణాళిక‌ను రూపొందించి అమలు చేస్తున్నట్లు జిల్లా క‌లెక్ట‌ర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 29/05/2025

గురువారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతివనం నందు ఏర్పాటుచేసిన యోగ శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పాల్గొని యోగాసనాలను అభ్యసించారు. గంటపాటు జరిగిన యోగ శిక్షణ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది పిల్లలు, పెద్దలు పాల్గొనగా, మాస్టర్ ట్రైనర్స్ ను అనుకరిస్తూ జిల్లా కలెక్టర్ కూడా అన్ని యోగాసనాలను కచ్చితత్వంతో చేసి చూపటం ఆశ్చర్యపరిచింది. శిక్షణ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గ్రామ‌, మండ‌ల‌, జిల్లా స్థాయిలో విస్తృత అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డానికి ఆయా స్థాయిల్లో క‌మిటీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు, విద్యార్ధులు, యువ‌త, స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఇలా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాముల‌ను చేస్తున్నామ‌ని చెప్పారు. జిల్లా కేంద్రంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద యోగా స్ట్రీట్‌ను ఏర్పాటు చేసి, ప్ర‌తిరోజూ ఒక కార్య‌క్ర‌మం నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. రోజుకో మండ‌లం చొప్పున ఎంపిక చేసి ర్యాలీలు, అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిర్వహిస్తున్నామన్నారు. యోగా మంత్ కార్య‌క్ర‌మంలో భాగంగా వందమంది మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి ఒక్కొక్కరు 50 మంది చొప్పున ట్రైనర్లను తీర్చిదిద్దేలా మూడు రోజులపాటు శిక్షణను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. వీరు మండల, గ్రామ పరిధిలో శిక్షణ అందజేస్తారన్నారు. గుర్తించిన పర్యాటక ప్రదేశాలలో కనీసం 5,000 వేల మందితో యోగా ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే మే 27న వశిష్ట గోదావరి తీరాన వలందర రేవు వద్ద భారీ ఎత్తున వినూత్న రీతిలో బోట్లు పైన యోగా ప్రదర్శన పూర్తి చేయడం జరిగిందన్నారు. జూన్ 3వ తేదీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున యోగా నిర్వహణకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. జూన్ 09వ తేదీ మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో, 16వ తేదీ భీమవరం అల్లూరి సీతారామ రాజు స్మృతి వనం వద్ద, 19వ తేదీ భీమవరం డియన్ఆర్ కాలేజీ, నరసాపురం వై యన్ యం కళాశాలలో 5 వేలు మందితో యోగాంధ్ర కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. వివిధ స్థాయిల్లో యోగ పోటీలను గ్రామ, వార్డు స్థాయిలలో మే 26 నుండి ప్రారంభించడం జరిగిందని, మే 30 తో ఈ పోటీలు ముగుస్తాయన్నారు. అలాగే మండల స్థాయిలో జూన్ 2 నుండి జూన్ 7 వరకు, జిల్లా స్థాయిలో జూన్ 9 నుండి జూన్ 14 వరకు పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్తమ యోగా పాట, ఉత్తమ యోగా పెయింటింగ్, ఉత్తమ యోగా వ్యాసం, తదితర అంశాలలో విజేతలను ప్రకటించి జూన్ 17 మరియు 18న బహుమతులను అందజేయడం జరుగుతుందన్నారు. జూన్ 2న రంగోలి పోటీలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా భారీఎత్తున యోగా ప్ర‌ద‌ర్శ‌నా కార్య‌క్ర‌మంకు సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో డీఈవో ఇ.నారాయణ, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఏవి అప్పారావు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి శ్రవణ్, ఆయుష్ శాఖ డాక్టర్ హరి శ్రీనివాస్, యోగా మాస్టర్ ట్రైనీలు యు. వెంకటేశ్వర రాజు, పి.భవాని, పి.రోహిణి, ఇశా ఫౌండేషన్ భీమవరం కోఆర్డినేటర్ డాక్టర్ డి.విజయ, ప్రముఖ సంఘ సేవకులు కంతేటి వెంకటరాజు, అల్లూరి సీతారామరాజు సేవ సమితి యోగ మాస్టర్ బి హెచ్ వి సత్యనారాయణ రాజు, స్థానిక ప్రజలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.

1.11 1.22 1.33