ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది.. తల్లిదండ్రులు అధైర్య పడవద్దు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికల స్థితిగతులను చూసి చలించిపోయిన జిల్లా కలెక్టర్…
ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను సాకటం ఎంతో కష్టమైన పని…
ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగుల తల్లిదండ్రులకు మరింత ఓర్పును అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నా..
దివ్యాంగులతో మమేకమై మాటామంతితో ఉత్సాహపరిచిన జిల్లా కలెక్టర్..
వారికి స్వయంగా భోజనం వడ్డించిన జిల్లా కలెక్టర్
ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను ఎంతో ఓర్పుతో సాకాల్సి ఉంటుందని, మీ ఇబ్బందులకు ఎల్లప్పుడూ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని, ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
బుధవారం భీమవరం పట్టణంలోని గాలి రామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న భవిత విలీన విద్య వనరుల కేంద్రం ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యంగా బాల బాలికల ఉచిత ఉపకరణాల పంపిణీ వైద్య నిర్ధారణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాల బాలికలను చాలా శ్రద్ధగా, ఓర్పుతో చూడవలసిన అవసరం ఉందని, దీనికి వారి తల్లిదండ్రులు పడే ఆవేదన ఏమిటో నేను అర్థం చేసుకోగలనన్నారు. ఇటువంటి పిల్లలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం భవిత విలీన విద్యా వనరుల కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి విద్యను, ఫిజియోథెరపీ తదితర సేవలను అందించడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా వారికి ప్రత్యేక ఉపకారణాలను అందజేసే నిమిత్తం ఎవరికి ఏ ఉపకారణాలు అందజేయాలో అనే పరీక్షలను దివ్యాంగుల వైద్య నిర్ధారణ శిబిరం ద్వారా గుర్తించి ఉపకరణాలను కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. వైద్య శిబిరాలను నవంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 17 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నవంబర్ 13న ఉండి నియోజకవర్గం లోని ఉండి, కాళ్ల, ఆకివీడు, పాలకోడేరు మండలాలకు సంబంధించి ఉండి ఎంపీపీ స్పెషల్ స్కూల్ నందు, 14వ తేదీన నరసాపురం నియోజకవర్గం సంబంధించి నరసాపురం, మొగల్తూరు మండలాలకు నరసాపురం శ్రీహరి పేట ఎంపీపీ స్కూల్ నందు, నవంబర్ 15న తాడేపల్లిగూడెం నియోజకవర్గం లోని తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలకు పెంటపాడు పోస్ట్ బేసిక్ గర్ల్స్ హై స్కూల్ నందు, నవంబర్ 17న తణుకు నియోజకవర్గానికి సంబంధించి తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు తణుకు మున్సిపల్ పీఎస్ అండ్ హెచ్ ఎస్ నెంబర్.1 నందు నిర్వహించడం జరుగుతుందని, వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లో శిబిరాలను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని, ఈ రెండు శిబిరాలలో దివ్యాంగుల పిల్లల అసెస్మెంట్ పూర్తి చేసి సుమారు రూ.10.46 లక్షల విలువైన ఉపకరణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. వీటిని సక్రమంగా వినియోగించడం ద్వారా దివ్యాంగులకు కొంత ఫిజియోథెరపీ, ఇతర యాక్టివిటీ సమకూరతాయని, పిల్లలను కూడా ఉత్సాహపరచడానికి ఉపకరిస్తాయని తెలిపారు. దివ్యాంగుల తల్లిదండ్రులు అధైర్య పడకుండా శ్రద్ధగా భవిత కేంద్రాల్లో చదువుకోవడానికి పంపించాలని, తద్వారా మానసిక ఎదుగుదలకు కూడా తోడ్పడుతుందన్నారు. అనంతరం ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యంగా బాలబాలికుల తల్లిదండ్రులకు ఉపకరణాల కిట్లను అందజేశారు. అనంతరం దివ్యాంగ విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాటామంతి కలిపి వారిలో చిన్న పిల్లలా కలిసిపోయి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంలో వారి తల్లిదండ్రుల్లో మనో ధైర్యాన్ని నింపారు. అనంతరం దివ్యాంగ పిల్లలకు స్వయంగా భోజనాన్ని కొసరి కొసరి వడ్డించారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాంసుందర్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ సిహెచ్.సుబ్రహ్మణ్యం, ఐఇ కోఆర్డినేటర్ టి.శ్రీనివాస్, హెడ్మాస్టర్ పి.శ్రీనివాసరావు, ఐఈఆర్టీ, ఐ ఈ డి ఎస్ ఎస్ టీచర్లు, ఫిజియోథెరఫిస్టులు, అలిమ్ కో కంపెనీకి సిబ్బంది, ఆయాలు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.