ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునేలా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి డిఇఓ, తాడేపల్లిగూడెం నియోజకవర్గం మండల విద్యాశాఖ అధికారులతో సమావేశమై తణుకు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, అత్తిలి, ఇరగవరం మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణపై పిపిటి ద్వారా సమీక్షించారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పిల్లలు బడి బయట కాకుండా బడిలో ఉండి చదువుకునేందుకు అవకాశాలను మెరుగుపరిచేలా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ చేపట్టడం జరిగిందన్నారు. పిల్లలు విద్యావంతలైతేనే దేశం ప్రగతివైపు పయనిస్తుందన్నారు. ప్రతి ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా విద్యార్థులను చక్కటి విద్యతో తీర్చిదిద్దాలన్నారు. ఒక గురువుగా మీరు నేర్పే విద్య పిల్లల భవిష్యత్తుకు పునాదిగా ఉంటుందన్నారు. అర కొరకు విద్యార్థులతో నడిచే పాఠశాలను పునర్వ్యవస్థీకరణ ద్వారా పటిష్ట పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. 60 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను మోడల్ స్కూల్ గా పరిగణిస్తూ ప్రతి తరగతికి ఒక క్లాస్ టీచర్ ను నియమించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా విద్యా బోధనలో నాణ్యత పెరిగి విద్యార్థులు చక్కని విద్యను అభ్యసించే అవకాశం మెండుగా ఉంటుందన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య దినదినాభివృద్ధి చెందేలా విద్య బోధన ఆకట్టుకోవాలన్నారు. ఈ అంశాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయులను చైతన్య పరచాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన అందించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. బోధనపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మెరుగైన సమాజ నిర్మాణానికి మంచి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. విద్యార్థులలో డ్రాప్ అవుట్స్ పూర్తిగా అరికట్టడానికి ఈ నూతన విధానం ఎంతో ఉపయుక్తమన్నారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థుల డ్రాప్ అవుట్స్ ని గుర్తించి, కళాశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులను చైతన్య పరచాలన్నారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలని, వారు వెళ్ళే మార్గంలో జాతీయ రహదారి దాటడం, రైల్వే ట్రాక్ దాటడం, తదితర ప్రమాదకర ఇబ్బందులను ఖచ్చితంగా సమీక్షించుకోవాలన్నారు. పాఠశాలల మిళితంపై ఇప్పటికే తయారుచేసిన నివేదికను పున పరిశీలనచేసి తుది నివేదికను సమర్పించాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఇ.నారాయణ, తణుకు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, అత్తిలి, ఇరగవరం ఎంఈఓలు డి.ఎం.సత్యనారాయణ, వి.హైమావతి, వి.హనుమ, పిఎంకె జ్యోతి, ఎం.శ్రీనివాస్, టీవీ రామకృష్ణ, ఎన్.రమేష్, ఎం వి ఎల్ కె ప్రసాద్, ఎస్ శ్రీనివాస్ రావు, జిబివి ప్రసాద్ రావు, ఆయా మండలాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.