ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉంటే వారి కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో మహిళల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.

శుక్రవారం ఉండి మండలం యండగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “స్వస్థనారి స్వశక్త పరివార్ అభియాన్” మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. తొలుత పిహెచ్సిలోని అన్ని వార్డులను పరిశీలించి అందిస్తున్న సేవలుపై ఆరా తీశారు. ఆబా ఐడి రిజిస్ట్రేషన్ ఎంత వరకు పూర్తి చేశారు, ఇంకా ఎన్ని చేయాలి, ఈ నెలలో ఎన్ని ప్రసవాలు చేశారు, ల్యాబ్ టెస్టులు ఎన్ని పూర్తి చేశారు, కౌమార దశ బాలికలకు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా, ఎనీమియా ముక్తభారత్ కింద పరీక్షలు చేసి రక్తహీనత ఉన్నవారికి టాబ్లెట్లు అందిస్తున్నారా, వృద్ధులకు టీబీ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీలతో మాట్లాడుతూ బాలామృతం సక్రమంగా అందిస్తున్నారా, గర్భిణీ స్త్రీలకు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడానికి అవగాహన కల్పిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈరోజు నిర్వహిస్తున్న “స్వస్థనారి స్వశక్త పరివార్ అభియాన్” మెడికల్ క్యాంపులో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, స్త్రీలకు, బాలికలకు అందరికీ తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఇంకా క్యాంపుకు రాని వారికి అవగాహన కల్పించి క్యాంపుకు వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంలో డిఎంహెచ్వో వివరిస్తూ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం కింద 70 సంవత్సరాలు పైబడి పిహెచ్సి పరిధిలోని నాలుగు వేల మందిని అబా ఐడి రిజిస్ట్రేషన్ నమోదు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు మూడు వేల మందిని రిజిస్టర్ చేయడం జరిగిందని, మిగిలిన వారిలో కొంతమంది చనిపోవడం, వేరే ప్రాంతాలకు తరలి వెళ్లడం జరిగిందని తెలిపారు. ఆబా ఐడి రిజిస్ట్రేషన్ ద్వారా 5 లక్షల రూపాయల విలువైన వైద్యానికి వారు అర్హులుగా ఉంటారని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ వైద్య శిబిరాన్ని, మందులను పరిశీలించి, వైద్య పరీక్షలకు వచ్చిన వారితో మాట్లాడి వారికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. ఈ క్యాంపులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ముందస్తుగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా రక్షించుకోవచ్చని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మహిళలు తమ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటారనే సత్సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల ఆరోగ్యమే పరిరక్షణగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. మహిళలు కుటుంబంలో అందరి బాగోగులు చూసుకుంటూ సమయానికి భోజనం చేయక తదితర కారణాల వలన తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తారని, దీనితో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయన్నారు. మహిళలకు ఆరోగ్యం బాగా లేకపోతే కుటుంబమంతా ఇబ్బంది పడతారని, మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు సగం పైగా బడ్జెట్ నిధులను వైద్య, విద్య రంగాలకు కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలు విధిగా పాటించాలని లేకుంటే చిన్నప్పటి నుండే మధుమేహము, రక్తపోటు వంటి వ్యాధులకు గురవుతామన్నారు. తొలి దశలోనే గుర్తిస్తే వాటిని నివారించుకోవచ్చన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కోసం అధికంగా క్రిమిసంహారక మందులు వాడటం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులు దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఉచిత వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని వారిని జిల్లా కలెక్టర్ కోరారు.
డిఎంహెచ్వో డాక్టర్ జి.గీతా బాయి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఈనెల 17వ తేదీ నుండి వచ్చే అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. చాలామంది మహిళలకు ఆరోగ్యపు అలవాట్లపై సరైన అవగాహన లేకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారని. ప్రోటీన్లు ఫైబర్ తదితర బలవర్ధకమైన ఆహారం ఎందులో ఉందో అవగాహన పెంపొందించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ జి.గీతాబాయి, పిహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డి. బెన్నీ సామ్యూల్, డాక్టర్ ఐ.సి కీర్తన, గైనకాలజిస్ట్ డాక్టర్ కె.దివ్య శ్రీ, ఆఫ్తాల్ టెక్నీషియన్ జగదీష్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, మహిళలు, విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.