Close

ప్రతి నెల జిల్లా, మండల స్థాయి అధికారులు పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల విద్యా బోధన, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, త్రాగునీరు, పరిసరాల పరిశుభ్రత పరిశీలించాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 08/01/2026

డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకం కింద జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యత, రుచికరమైన భోజనాన్ని అందించాలి.

నిర్దేశించిన మెనూ ప్రకారం ఎటువంటి మార్పులు లేకుండా విద్యార్థులకు సమతుల ఆహారాన్ని అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో గురువారం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకం – పీఎం పోషణ, జిల్లాస్థాయి స్టీరింగ్ కమ్ సమన్వయ కమిటీ సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.

ముందుగా జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ జిల్లాలో మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరు, విద్యార్థులకు మెనూ ప్రకారం అందిస్తున్న ఆహార పదార్థాలు, పాఠశాలలోని నూట్రి గార్డెన్స్ అభివృద్ధి, తదితర అంశాలపై సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా మధ్యాహ్నం భోజన పథకం ద్వారా ప్రతి విద్యార్థికి పోషకాహారం అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లాలో 1,383 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ప్రతి రోజూ నిర్దేశించిన ప్రమాణాల మేరకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలన్నారు. భోజనంలో అన్నం, పప్పు, కూరగాయలు, గుడ్డు,పాలు, రాగిజావ, చిక్కి వంటి పోషక విలువలు కలిగిన నాణ్యమైన పదార్థాలను విద్యార్థులకు మెనూ ప్రకారం ఉండేవిధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు. సంక్రాంతి పండుగ అనంతరం జిల్లా, మండల స్థాయి అధికారులు ఆయా పరిధిలోని పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలు నాణ్యత, త్రాగునీరు, వంటశాల, వంటకు ఉపయోగిస్తున్న సామాగ్రి, పరిశుభ్రతలను పరిశీలించాలన్నారు. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతినెల 10 మండలాలలో 10 పాఠశాలలను సందర్శించి పాఠశాలల్లో ఆహార పదార్థాలు తయారీ, ముడి సరుకులు, స్టోర్ రూమ్ తనిఖీలు చేసి సూచనలు సలహాలు అందించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, రక్తహీనత గల విద్యార్థిని విద్యార్థులకు మందులు అందించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాలల ప్రాంగణాల్లో న్యూట్రి గార్డెన్స్ అభివృద్ధి చేసి కూరగాయల సాగుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కూరగాయల సాగుకు యూరియాను ఉపయోగించకుండా సాంప్రదాయ సాగులో పండించాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాంసుందర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్.వి.అరుణ కుమారి, బి సి సంక్షేమ శాఖ అధికారి ఏవి సూరిబాబు, ఐ సి డి ఎస్ పిడి డి.శ్రీలక్ష్మి, డీఎస్ఓ ఎన్.సరోజ, ఎంఈఓలు, డిప్యూటీ ఎంఈఓలు, తదితరులు పాల్గొన్నారు.