Close

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. …జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 24/01/2026

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

రహదారి భద్రత… మన అందరి బాధ్యత.

జాతీయ రహదారి భద్రత మహోత్సవం 2026 సందర్భంగా శనివారం భీమవరం పాత బస్టాండ్ వద్ద నుండి జిల్లా రవాణా, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, వివిధ కళాశాలల వాహనాల డ్రైవర్లు, ప్రజలతో నిర్వహించిన వాక్ థాన్ ర్యాలీని శనివారం జిల్లా కలెక్టర్ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ వాక్ థాన్ ర్యాలీలో అడిషనల్ ఎస్పీ వి.బీమారావు, జిల్లా రవాణా శాఖ అధికారి కె.ఎస్.ఎం.వి కృష్ణారావు, డి.ఎస్.పి రఘువీర్ విష్ణు, ఆర్డిఓ కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రత మన అందరి బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తతతో ఉండాలన్నారు. మానవ తప్పిదాల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. గత సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో 86 మంది చనిపోవడం చాలా బాధాకరమన్నారు. ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి తీరని నష్టమన్నారు. రోడ్డు ప్రయాణంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు, ముఖ్యంగా యువతకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు ప్రమాదాల రహిత జిల్లాగా ఉంచేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.
పాత బస్టాండ్ నుండి ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్దకు ర్యాలీ చేరుకున్న అనంతరం ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇంజనీరింగ్ కళాశాల ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు హై ఎండ్ టెక్నాలజీతో రూపొందించిన హెల్మెట్ పరిశీలించి, పని చేయు విధానాన్ని డెమో ద్వారా వివరించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభినందించారు. రోడ్ భద్రత మాసోత్సవాలు సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలు, వివిధ కళాశాలల వాహనాల డ్రైవర్లకు కళ్ళజోళ్ళు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ కె. ఎస్ ఎం వి కృష్ణ రావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి. శ్రీనివాసరావు, మోటర్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కె.ఎస్.యన్ ప్రసాద్, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఎస్ వి వి సత్యనారాయణ, పీ.నరేంద్ర బాబు, ఏ సత్య ఫణి తేజ, పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది, కళాశాలల వాహనాల డ్రైవర్లు, ప్రజలు, తదితరులు ఉన్నారు.