Close

ప్రతి ఒక్కరికి కంటి చూపు ఎంతో ప్రధానం.. ఆనంద ఫౌండేషన్ సేవలు అభినందనీయం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 19/08/2025

మంగళవారం ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం జె.పి.రోడ్ ఆనంద ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని, కంటి పరీక్షలు నిర్వహించుకున్న వారికి కలెక్టర్ చేతులమీదుగా కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కంటి చూపు ఎంత ప్రధానమో, చూపు తగ్గిన వారు దాని నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యం అన్నారు. తరిగిన కంటిచూపు తిరిగి పొందలేం అనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. మెరుగైన కంటి చూపు కోసం, కంటి చూపు తగ్గకుండా ఉండడం కోసం ఆకుకూరలు, పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు, కంటి వైద్యుల వద్ద తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకోని ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ నిర్వాహకులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు, కళ్ళజోళ్ళు పంపిణీకి ముందుకు వచ్చి అందజేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఫౌండేషన్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములు కావడం చాలా సంతోషం అన్నారు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలను అందించేందుకు చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథ్ రాజు, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానన్నారు.

ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశి విశ్వనాథరాజు మాట్లాడుతూ జులై 17 తేదీన సుమారు 800 మందికి ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ మరియు భీమవరం వివిఎస్ఎం ఐ హాస్పిటల్ సౌజన్యంతో భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్ నందు కంటి పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. కంటి చూపులో లోపాలున్నవారికి శస్త్ర చికిత్సలు చేయించడం జరిగిందని, అలాగే కళ్ళజోళ్ళు అవసరం అయిన 360 మందికి ఈరోజు కళ్ళజోళ్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేసుకోవడం జరుగుచున్నదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ వి.రామరాజు, దాయన చంద్రాజి, భారతీయ విద్యా భవన్ డైరెక్టర్ రఘుపతి రాజు, ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.