Close

ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలి.

Publish Date : 01/06/2026

పీజీఆర్‌ఎస్‌లో 156 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్‌లో 38 దరఖాస్తులు స్వీకరణ.

… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

జిల్లా కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి ఎ.వెంకటలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వెంకటేశ్వరరావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అధికారులు ప్రజల నుండి స్వీకరించిన ప్రతి అర్జీ పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి అర్జీకి నిర్ణీత గడువు లోపల శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఫిర్యాదు దారులతో అధికారులు నేరుగా మాట్లాడాలన్నారు. ఫిర్యాదు దారులు సంతృప్తి చెందే విధంగా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ రోజు స్వీకరించిన అర్జీలలో కొన్ని ఇలా ఉన్నాయి.

* ఆకివీడు మండలం, పెదకాపవరానికి చెందిన జి.లక్ష్మీ మానస అర్జీ సమర్పిస్తూ, తనకు 3 ఎకరాలు వ్యవసాయ భూమి ఉందని, పట్టాదార్ పాస్ పుస్తకం 1బి అడంగల్ లో 2.72 నమోదయిందని, 28 సెంట్లు భూమి తగ్గిందని,రీ సర్వే చేయించి నమోదు కాని 28 సెంట్లు భూమిని ఆన్లైన్లో సవరణ చేయాలని కోరారు.

* వీరవాసరం మండలం, అండలూరు గ్రామానికి చెందిన కుసుమలక్ష్మి తనకు ప్రభుత్వం 2024 వ సంవత్సరంలో 72 గజాల ఇంటి స్థల పట్టా ఇచ్చారని, ఇప్పటివరకు స్థలాన్ని చూపించలేదని, సరిహద్దులు గుర్తించి ఇంటి స్థలాన్ని ఇప్పించాలని అర్జీ సమర్పించారు.

* వీరవాసరం మండలం, కొణితివాడ బుధరాయుడు చెరువు నివాసి బాల ఏడుకొండలు మరియు గ్రామ ప్రజలు అర్జీ సమర్పిస్తూ, గ్రామంలో లో, హై వోల్టేజీ కారణంగా గ్రామంలో 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, విద్యుత్ శాఖ అధికారులు అదనపు ట్రాన్స్ఫర్ మంజూరు చేసి 4 నెలలు కావస్తున్న, ఇప్పటివరకు గ్రామంలో ఏర్పాటు చేయలేదని దయచేసి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు.

* పెనుగొండ మండలం, సిద్ధాంతం గ్రామానికి చెందిన బిక్కిన సాంబశివరావు తనకు కంటి చూపు తగ్గిపోవడం వలన రోజువారి పనులు చేయలేక జీవనోపాధికి చాలా ఇబ్బంది పడుతున్నానని తనకు వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.

* పెనుగొండ మండలం, పెనుగొండ గ్రామానికి చెందిన తమనంపూడి వెంకట రామకృష్ణారెడ్డి తనకు 10 సెంట్లు వ్యవసాయ భూమి ఉందని,ఆన్లైన్ లో 9 సెంట్లు నమోదయిందని తిరిగి రీసర్వే చేసి తగ్గిన సెంటు భూమిని ఆన్లైన్లో చూపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

* తణుకు పురపాలక సంఘం 7వ వార్డు నివాసితులు తమ వార్డులో రోడ్డు, మంచినీటి సదుపాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, మా వార్డులో రోడ్డు, త్రాగునీరు సదుపాయం కల్పించాలని వినతి పత్రం సమర్పించారు.

ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్ సభ్యుడు మేళం దుర్గాప్రసాద్ మరియు ఇతరులు పాల్గొన్నారు.